Begin typing your search above and press return to search.

రేణుకమ్మ దర్పం వైరల్ అవుతోంది

By:  Tupaki Desk   |   3 Jun 2016 4:44 AM GMT
రేణుకమ్మ దర్పం వైరల్ అవుతోంది
X
కలిసి రాని కాలంలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తుగులుతోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ గా.. పార్టీ అధినేత్రి సోనియాకు క్లోజ్ అయిన తెలంగాణ నేతల్లో రేణుకాచౌదరి ఒకరు. తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో ఒక వైరల్ కావటమే కాదు.. సోషల్ మీడియాలో ఆమె తీరుపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేన్నైనా పట్టించుకోకుండా వదిలేసే సగటు జనం.. అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ హడావుడి చేసే నేతల తాట తీయటం మామూలే. తాజాగా బయటకు వచ్చిన రేణుకమ్మ దర్పం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పేదిగా ఉండటం గమనార్హం.

ఆమె కుటుంబం మొత్తం రెస్టారెంట్ కు వెళ్లిన సందర్భంలో తమ ఇంటి చిన్నారిని చూసుకునే అమ్మాయికి ఇచ్చే విలువను వీడియో సాక్షిగా చూస్తున్న వారంతా విస్తుపోయే పరిస్థితి. రేణుకా చౌదరి ఫ్యామిలీ అంతా కూర్చొని భోజనం చేస్తుంటే.. ఆ పనిపిల్లను కనీసం కూర్చోమని కూడా చెప్పకపోవటం గమనార్హం. వారంతా భోజనం చేస్తుంటే ఆ పనమ్మాయి మాత్రం చేతులు కట్టుకొని నిలుచోవటంపై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ వీడియోపై పలువురు ట్వీట్స్.. రీ ట్వీట్స్ చేస్తున్నారు.

గతంలో మహిళా శిశు సంక్షేమ శాఖను నిర్వహించిన ట్రాక్ రికార్డు ఉన్న రేణుకమ్మపై ఆన్ లైన్ పై ఎలాంటి వ్యాఖ్యలు సంధిస్తున్నారనటానికి చిన్న ఉదాహరణగా చెప్పాలంటే.. ‘‘మీ చిన్నారిని చూసుకునే పని అమ్మాయికి భోజనం పెట్టించలేనప్పుడు ఆ అమ్మాయిని రెస్టారెంట్ కు తీసుకెళ్లకండి’ అని ఒకరు వ్యాఖ్యానిస్తే మరొకరు ఒక అడుగు ముందుకేసి.. ‘‘కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ భోజనం చేస్తున్నప్పుడు రేణుకా చౌదరి కూడా ఇలానే నిల్చుంటారు’’ అంటూ వ్యాఖ్యానించటం గమనార్హం. గతంలో మాదిరి ఇప్పటి రోజులు లేవని.. ప్రతిఒక్కరి చేతిలో సెల్ ఫోన్లు.. వాటిల్లో కెమేరాలు ఉంటాయన్న విషయాన్ని రేణుకమ్మ లాంటోళ్లు గుర్తిస్తే మంచిది. వీడియోకు సంబంధించి రియాక్ట్ అయి లెంపలేసుకుంటే సబబుగా ఉంటుందేమో..?