Begin typing your search above and press return to search.

ఏపీలో మూడు...తెలంగాణ‌లో రెండు రాజ‌ధానులు?

By:  Tupaki Desk   |   15 Aug 2020 4:00 PM GMT
ఏపీలో మూడు...తెలంగాణ‌లో రెండు రాజ‌ధానులు?
X
ఏపీలో మూడు రాజ‌ధానుల ఏర్పాటుపై ఇప్ప‌టికే వివిధ పార్టీల, వేదిక‌ల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ‌లో భాగంగా విశాఖ‌లో ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్ ఏర్పాటుపై ఆగ‌స్టు 16న ముహుర్తం ఖ‌రారు చేసుకున్న‌ప్ప‌టికీ అనంత‌రం ప్ర‌భుత్వం వాయిదా వేసుకుంది. మ‌రోవైపు ఇదే స‌మ‌యంలో తెలంగాణ‌లో రెండు రాజ‌ధానుల అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఒక‌రి త‌ర్వాత ఒక‌రు అన్న‌ట్లుగా సీనియ‌ర్ నేత‌లు దీని గురించి స్పందిస్తున్నారు.

ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ-2014 రద్దు బిల్లు‌కు గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్ ఆమోదం తెలిపిన త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు హీటెక్కిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం ముందుకు పోతున్న త‌రుణంలో తెలంగాణ‌లో కూడా రెండు రాజ‌ధానుల అంశం పరిశీలించే అవ‌కాశం ఉంద‌ని ఇటీవ‌లే కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి.హ‌నుమంత‌రావు వ్యాఖ్యానించారు. ఏపీలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా సీఎం కేసీఆర్ కూడా రెండు రాజధానులు చేసే ఆలోచన చేసే అవకాశం ఉంద‌ని అంచ‌నా వేశారు. తెలంగాణ‌లో మరో రాజధానిగా భవిష్యత్తులో కరీంనగర్‌ను చేస్తారు అంటూ వీహెచ్‌ ప్ర‌క‌టించారు.

తాజాగా మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి (ఎంఆర్‌పీఎస్‌) వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా వ‌రంగ‌ల్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు స‌రైన ప్ర‌త్య‌ర్థి తామేన‌ని సంచ‌ల‌న కామెంట్లు చేశారు. గ‌తంలో ద‌ళితుల‌ను ముఖ్య‌మం‌త్రిని చేస్తామ‌ని ప్ర‌క‌టించి కేసీఆర్ మాట త‌ప్పాడ‌ని ఆరోపించిన మంద‌కృష్ణ 2023లో ముఖ్య‌మంత్రి పీఠాన్ని కైవ‌సం చేసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వ‌రంగ‌ల్ జిల్లాను తెలంగాణ‌కు రెండో రాజ‌ధానిని చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.