Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఫుల్ జోష్‌.. ఒక్క‌రోజే ఇద్ద‌రు కేంద్ర‌మంత్రుల ప్ర‌శంస‌

By:  Tupaki Desk   |   22 Dec 2018 5:30 PM GMT
కేసీఆర్ ఫుల్ జోష్‌.. ఒక్క‌రోజే ఇద్ద‌రు కేంద్ర‌మంత్రుల ప్ర‌శంస‌
X
గులాబీ ద‌ళ‌ప‌తి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ కు ఒకే రోజు ఇద్ద‌రు ప్ర‌ముఖుల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇద్ద‌రు కేంద్ర మంత్రులు గులాబీ ద‌ళ‌ప‌తిని ప్ర‌శంసించారు. దేశంలో రైతు రుణమాఫీ ని అత్యంత సమర్థవంతంగా అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కితాబిచ్చారు. రైతును రాజు చేయాలనే సంకల్పంతో.. రైతుబంధు పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టి ఆ పథకాన్ని దేశానికే దిక్సూచిలా చేశారు. తాజాగా ఒడిశా, జార్ఖండ్ రాష్ర్టాలు రైతుబంధు పథకాన్ని ఆదర్శంగా తీసుకొని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నాయి. తెలంగాణలో రైతుబంధు పథకం కింద ఎకరానికి సంవత్సరానికి రూ. 8 వేల పెట్టుబడి చొప్పున ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ పెట్టుబడి సాయాన్ని మరో రూ. 2 వేలు పెంచి మొత్తంగా సంవత్సరానికి రూ. 10 వేల పెట్టుబడి సాయం చేస్తామని కేసీఆర్ ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో హామీనిచ్చిన విషయం విదితమే. ఆ మేరకు రాబోయే ఖరీఫ్ సీజన్‌లో ఎకరానికి రూ. 5 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం చేయనున్నారు. ఈ ప‌థ‌కాన్నే జైట్లీ ప్ర‌శంసించారు.

జీఎస్టీ మండ‌లి ఢిల్లీలో స‌మావేశ‌మై ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంది. అనంత‌రం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ ప‌లు అంశాలు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రుణ‌మాఫీని అభినందించారు. ఏడెనిమిది రాష్ర్టాలు రైతులకు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి రుణాలు మాఫీ చేయలేదన్నారు. పంజాబ్, కర్ణాటక రాష్ర్టాలు రైతుల రుణమాఫీ విషయంలో మాట నిలబెట్టుకోలేకపోయాయని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ అభివృద్ధిలో తెలంగాణ ముందు వరుసలో ఉందని జైట్లీ పేర్కొన్నారు.

కాగా, ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఇవాళ కలిశారు. ఇటీవల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సాధించిన విజయానికి కేసీఆర్‌ను కేంద్రమంత్రి అభినందించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌ పై వారు చ‌ర్చించుకున్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు సహకరించాలని కేంద్రమంత్రిని సీఎం కేసీఆర్ కోరారు. రూ. 100 కోట్ల కంపా నిధులు విడుదల చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో 188 అటవీ బ్లాక్‌ల అభివృద్ధికి నిధులు వినియోగిస్తామని సీఎం తెలిపారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలకు రెండో దశ పర్యావరణ అనుమతులు త్వరగా ఇవ్వాలని కేంద్రమంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చినందుకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పరిశీలించాలని, అడవుల పునరుద్ధరణకు రాష్ట్రం తీసుకున్న చర్యలను పరిశీలించాలని హర్షవర్ధన్‌ ను కేసీఆర్ కోరారు. అడవుల రక్షణకు కొత్త చట్టం తీసుకువచ్చే ఆలోచన ఉందని కేంద్రమంత్రి పేర్కొన్నారు.