Begin typing your search above and press return to search.

ఇంతమందిలో ఇద్దరు సీఎంలేనా వచ్చేది బాబు?

By:  Tupaki Desk   |   20 Oct 2015 9:18 AM GMT
ఇంతమందిలో ఇద్దరు సీఎంలేనా వచ్చేది బాబు?
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకున్న పేరు ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జాతీయస్థాయిలో నాయకత్వాన్ని గ్రూపుల్ని ఏర్పాటు చేసి.. తృతీయ కూటమి ఏర్పాటు చేసే సత్తా బాబు సొంతం. ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ.. మోడీ పుణ్యమా అని అలాంటి వాటికి స్వస్తి పలికి.. బుద్దిగా మోడీ జట్టులో భాగస్వామిగా మారిపోయారు.

వ్యక్తిగతంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో.. పార్టీ అధినేతలతో సంబంధాలున్నప్పటికీ ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్న ముఖ్యమంత్రుల సంఖ్య చూస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే.. ప్రధాని మోడీ కాకుండా శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్నది కేవలం ఇద్దరు ముఖ్యమంత్రులే కావటం గమనార్హం.

ఇన్ని రాష్ట్రాలున్నప్పటికీ అమరావతికి వస్తున్న ముఖ్యమంత్రులు ఇద్దరికే పరిమితి కావటం గమనార్హం. వీరిలో ఒకరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే.. మరొకరు పంజాబ్ ముఖ్యమంత్రి బాదల్. నిజానికి.. శంకుస్థాపనతో పోలిస్తే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలోనే భారీగా నేతలు హాజరయ్యారని చెప్పొచ్చు.

హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతులున్న చంద్రబాబుకు పలువురు నేతలతో నేరుగా సంబంధాలు ఉన్నప్పటికీ.. ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమం లాంటి భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన క్రమంలో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రులు వచ్చేలా చేస్తారని భావించారు. కానీ.. అందుకు భిన్నంగా ఎవరూ రాకపోవటం గమనార్హం. చివరకు ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం హాజరు కాకపోవటం చూస్తుంటే.. ఇదంతా మోడీ మ్యాజిక్కా? అన్న సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఏపీ శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని భావిస్తున్న చంద్రబాబు మాటలకు భిన్నంగా కేవలం ఇద్దరు ముఖ్యమంత్రులు రావటం కాస్తంత ఆశ్చర్యకరమైన అంశమే సుమా.