Begin typing your search above and press return to search.

మోడీ సాబ్ భయమేస్తోంది : నిముషానికి రెండు కోట్ల అప్పు...?

By:  Tupaki Desk   |   29 July 2022 2:30 AM GMT
మోడీ సాబ్ భయమేస్తోంది : నిముషానికి రెండు కోట్ల అప్పు...?
X
ఈ దేశంలో అప్పులు ఎవరెస్ట్ శిఖరం మాదిరిగా ఎత్తున ఉన్నాయి. అవి అంతటితో ఆగడంలేదు. క్షణక్షణానికి పెరిగిపోతున్నాయి. అప్పులు కుప్ప మన భారతం అని చెప్పుకోవడానికి ఈ రొజున సిగ్గు వేయడం లేదు భయమేస్తోంది. ఎందుకంటే ఇన్నేసి లక్షల కోట్ల అప్పులతో భారతం ఏమైపోతుందో ఎలాంటి పరిస్థితులు వస్తాయో అన్నదే బాధ. సగటు జనాల ఆవేదన.

అసలు విషయానికి వస్తే రిజర్వ్ బ్యాంక్ వెబ్ సైట్ లో పెట్టిన దాని మేరకు ఈ ఏడాది మార్చి 31 నాటికి అంటే 2021-22 ఆర్ధిక సంవత్సరం నాటికి దేశం బయట నుంచి తెచ్చిన అప్పులు 4.94 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇది గత ఏడాదికి అంటే 2020-21 ఫైనానిషియల్ ఇయర్ కి పోల్చి చూస్తే 47.1 బిలియన్ డాలర్లు పెరిగినట్లుగా చెబుతున్నారు.

ఇక కేంద్రంలో మోడీ సర్కార్ ఏర్పడకపూర్వం దేశం అప్పులు ఎంత ఉన్నాయి అంటే దాదాపుగా 55.87 లక్షల కోట్లు అని లెక్క తేలుతోంది. మరి మోడీ ప్రధాని అయిన తరువాత దేశం కొత్తగా చేసిన అప్పులు చూస్తే డబుల్ రేట్ దాటి త్రిబుల్ రేట్ కి చేరుకుంది. ఈ ఏడాది అంతానికి ఈ అప్పులు పెరిగి అక్షరాలా ఇవి 152.17 లక్షల కోట్లకు చేరుకుంటాయని లెక్క వేస్తున్నారు. అంటే ఏకంగా వంద లక్షల కోట్ల అప్పులను ఈ ఎనిమిదేళ్లలో మోడీ సర్కార్ కొత్తగా చేసిందని చెప్పాలి. ఈ లెక్క కూడా కేంద్రం పార్లమెంట్ కి ఇచ్చిన వివరాలు. అంటే బాబోయ్ అని పించకమానదు.

మోడీ సర్కార్ ఏలుబడిలో ఈ భారత దేశంలో అప్పు ఎలా పెరుగుతోంది అంటే ప్రతీ నిముషానికి రెండు కోట్లు అప్పు చేస్తున్నారు అన్న మాట. ఇది ఈ దేశంలోని నూటా నలభై కోట్ల మంది నెత్తిన మీద పెడుతున్న అప్పు. 2014 మార్చి 31 నాటికి ఈ దేశంలో నాటికి ఉన్న 130 కోట్ల మంది జనాభా మీద తలసరిగా చూస్తే ఒక్కొక్కరి నెత్తిన రూ.4.30 లక్షల వరకు ఉంది. అది కాస్తా ఇపుడు ఎంతకు పెరిగింది అంటే మూడింతలు అని అంటున్నారు. పైగా 140 కోట్ల మందిగా జనభా పెరిగి అంతా పంచుకున్నా కూడా ఒక్కొక్కరి నెత్తిన 11 లక్షల మేర అప్పు బండ ఉంది అన్న మాట.

ఇక ఈ దేశంలోని పౌరుడు చాలా దర్జాగా చెప్పుకోవచ్చు. నేను పేదవాడీ కాను అని. ఎందుకంటే నెత్తి మీద 11 లక్షల అప్పు ఉన్నవాడు సామాన్యుడా. అలా ఈ దేశాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత మోడీ సర్కార్ దే అని విపక్షాలు అంటున్నాయి. లోపభూయిష్టమైన ఆర్ధిక విధానాల వల్లనే ఇదంతా అని నిపుణులు చెబుతున్నారు.

మరో వైపు చూస్త ఈ ఎనిమిదేళ్లలో చాలా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ అయిపోయాయి. మరో వైపు ద్రవ్యోల్బనం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. అలాగే నిత్యావసరాలు పెరిగాయి. ఇంకో వైపు జనాల మీద పన్నుల బాదుడు కూడా బాగా పెరిగింది. ఇంత చేసినా కూడా అప్పులు మాత్రం జనాలకు తప్పడం లేదు. మరి ఇలా ఎడా పెడా అప్పులు చేస్తూ జనాలను పట్టి పీడిస్తూ వేస్తున్న పన్నుల ఆదాయం అంతా ఎక్కడికి పోతోంది ఏమైపోతోంది అన్నదే కోటి డాలర్ల ప్రశ్న. జవాబు మాత్రం అసలు దొరకదంతే.