Begin typing your search above and press return to search.

మ‌త్తుతో రెచ్చిపోయి పోణాలు పోగొట్టుకున్నారే!

By:  Tupaki Desk   |   4 Aug 2017 7:28 AM GMT
మ‌త్తుతో రెచ్చిపోయి పోణాలు పోగొట్టుకున్నారే!
X
తాగ‌టం త‌ప్పా? అంటే.. ఎవ‌రి అభిప్రాయం వాళ్లు చెబుతారు. తాగ‌టం మీద చ‌ర్చ‌ను ప‌క్క‌కు పెడితే.. పూటుగా తాగేసే వారు ఎవ‌రైనా స‌రే.. ఏం చేయ‌కూడ‌దో చెప్పే వైర‌ల్ వీడియో ఒక‌టి ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. చేసింది వెధ‌వ ప‌ని అయిన‌ప్ప‌టికీ.. అమాయ‌కంగా విలువైన ప్రాణాలు పోగొట్టుకున్నారే అన్న వేద‌న అంద‌రిలోనూ వ్య‌క్త‌మ‌వుతోంది. కుర్ర‌త‌నంతో.. ఒళ్లు పైకి తెలీకుండా ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించిన యువ‌కుల బృందానికి చెందిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

మ‌హారాష్ట్ర లోని ప్ర‌ఖ్యాత విహార ప్రాంత‌మైన అంబోలీ ఘాట్ తో చోటు చేసుకున్న విషాద ఉదంతం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. కోల్హాపూర్ పౌల్ట్రీ ఫాంలో ప‌ని చేస్తున్న ఏడుగురు యువ‌కులు స‌ర‌దాగా అంబోనీ ఘాట్‌కు పిక్నిక్‌గా వెళ్లారు.
న‌లుగురు కుర్రాళ్లు స‌ర‌దాగా పిక్నిక్ కి వెళ్ల‌టం.. అందులోనూ ఎంజాయ్ అన్న వెంట‌నే వారితో పాటు మ‌ద్యం బాటిళ్లు రావ‌టం దాదాపుగా జ‌రిగేదే. తాజా ఉదంతంలోనూ అదే జ‌రిగింది. ఫుల్ గా తాగేసిన యువ‌కుల్లో.. మ‌త్తు పూర్తిగా త‌ల‌కెక్క‌టం.. త‌మ‌ను తాము సాహ‌స‌వంతులుగా అంద‌రి ముందు షో చేయాల‌నుకున్నారో ఏమో కానీ.. అంబోలీ బ్రిడ్జి రేలింగ్ అంచుపై మ‌ద్యం సీసాతో సాహ‌స విన్యాసాలు చేయ‌టం షురూ చేశారు.

ఇలా చేస్తున్న ఇద్ద‌రిని మిగిలిన స్నేహితులు వారించి.. నాలుగు చీవాట్లు పెట్టాల్సింది పోయి.. వారిని ప్రోత్స‌హిస్తూ.. కేరింత‌లు కొట్టారు. ఊహించ‌ని రీతిలో కాలు జారిన ఒక‌రు లోయ‌లోకి ప‌డిపోతుండ‌గా.. వారిని మ‌రొక‌రు ర‌క్షించ‌బోయి ఇద్ద‌రూ కింద‌కు ప‌డిపోయారు.

దాదాపు రెండు వేల అడుగుల లోతు ఉన్న లోయ‌లోకి వారు ప్ర‌మాద‌వ‌శాత్తు ప‌డిపోయారు. జ‌రిగిన ప్ర‌మాదం గురించి అర్థ‌మైన స్నేహితులు గుట్టుచ‌ప్పుడు కాకుండా అక్క‌డ నుంచి వెళ్లిపోయారు. అనంత‌రం పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి స్నేహితుల మిస్సింగ్ కేసు పెట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు మిస్సింగ్ కేసును చేధించే ప‌నిలో ఉన్నారు. అయితే.. ప్రాణాలు కోల్పోయిన మిత్ర బృందానికి చెందిన ఒక‌రు వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌టంతో అది కాస్తా వైర‌ల్ అయ్యింది. చివ‌ర‌కు అస‌లు విష‌యాన్ని గుర్తించిన పోలీసులు మృత‌దేహాల్ని గుర్తించారు. స‌ర‌దా కోసం తాగే వారు ఎవ‌రైనా.. ఏం చేయ‌కూడ‌దో చెప్పే ఉదంతంగా దీన్ని చెప్ప‌క త‌ప్ప‌దు.