Begin typing your search above and press return to search.

నరసాపురంలో సంక్రాంతికి ప్రతి ఇంటికి 2 ఫ్యాన్లు

By:  Tupaki Desk   |   4 Nov 2015 7:38 AM GMT
నరసాపురంలో సంక్రాంతికి ప్రతి ఇంటికి 2 ఫ్యాన్లు
X
దేశంలో ప్రారంభించనున్న సరికొత్త కార్యక్రమానికి ఏపీలోని నరసాపురం వేదిక కానుంది. విద్యుత్తు వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలన్న ప్రయత్నంలో వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తున్న సర్కారు.. దేశ వ్యాప్తంగా విద్యుత్తు వినియోగాన్ని మరింత పరిమితం చేసేందుకు వీలుగా ఒక పైలెట్ ప్రాజెక్టు చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు నరసాపురం ఎంపికకావటం గమనార్హం.

పైలెట్ ప్రాజెక్టుకు నరసాపురం ఎంపిక కావటం ఇదే తొలిసారి కాదు. గతంలో ఎల్ ఈడీ బల్బుల్ని ప్రతి ఇంటికి రెండింటిని సరఫరా చేసే కార్యక్రమాన్ని నరసాపురంలోనే స్టార్ట్ చేశారు. మిగిలిన బల్బులతో పోలిస్తే తక్కువ విద్యుత్తు వినియోగం జరిగే ఎల్ ఈడీ బల్బుల్ని నరసాపురంలో పంపిణీ చేసిన తర్వాత.. ఆ ఫలితాల్ని చూసిన అనంతరం దేశ వ్యాప్తంగా ఇప్పుడా పథకాన్ని అమలు చేస్తున్నారు. తాజాగా అమలు చేయనున్న పథకాన్ని చూస్తే.. ప్రతి ఇంటికి రెండు ఫ్యాన్లను ఇవ్వనున్నారు. సంక్రాంతి తర్వాత వీటిని పంపిణీ చేయనున్నారు.

ప్రతి ఇంటికి 2 ఫ్యాన్లను పంపిణీ చేస్తారు. మామూలు ఫ్యాన్లు 70నుంచి 80 వాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటే.. ప్రభుత్వం పంపిణీ చేసే ఫ్యాన్లు మాత్రం కేవలం 35 వాట్ల సామర్థ్యంతో ఉంటాయి. ఏడేళ్లు వారెంటీ ఉండే ఈ ఫ్యాన్లను ఒక్కొక్కటి రూ.1200 చొప్పున వసూలు చేస్తారు. ఒకేసారి కాకుండా.. ఈ మొత్తాన్ని 10 నుంచి 20 వాయిదాల్లో వసూలు చేస్తారు. ఈ ఫ్యాన్లను కచ్ఛితంగా తీసుకోవాలన్న నిబంధన ఏమీ లేదు. ఫ్యాన్లు తీసుకున్న వారి విద్యుత్తు బిల్లులలో ప్రభుత్వం నిర్ణయించిన వాయిదాల ప్రకారం.. నెలసరి కరెంటు బిల్లులతో పాటు.. ఈ మొత్తాన్ని కలుపుతారు.

దీని ప్రకారం.. విద్యుత్తు వినియోగంలో వచ్చే వ్యత్యాసాన్ని గుర్తిస్తారు. ఈ పథకం కానీ విజయవంతంగా అమలు అయిన పక్షంలో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తారు. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తున్న ఈ పైలెట్ ప్రాజెక్టు ఎంతమేర విజయవంతం అవుతుందో చూడాలి. ఒకవేళ ఎల్ఈడీ బల్బుల మాదిరి ఫ్యాన్ల ప్రయోగం విజయవంతం అయితే.. విద్యుత్తు వినియోగంలో చాలానే వ్యత్యాసం వస్తుందన్న మాట వినిపిస్తోంది.