Begin typing your search above and press return to search.

ఇద్దరు మిత్రులు... ఉమ్మడి శత్రువు... ?

By:  Tupaki Desk   |   21 Nov 2021 4:30 PM GMT
ఇద్దరు మిత్రులు... ఉమ్మడి శత్రువు... ?
X
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఎవరూ ఉండరని అంటారు. కానీ కొన్ని పరిస్థితులు కొందరిని శాశ్వత శత్రువులుగానే మార్చేస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు అలా రెండు పార్టీలకు, ఇద్దరు సీఎంలకు ఈ రోజుకీ ఉమ్మడి శత్రువుగానే ఉండిపోయారు. చంద్రబాబు టీడీపీకి తెలంగాణాలో బలం అంతంతమాత్రమే. అయితేనేమి ఆయన అక్కడే నివాసం ఉన్నారు. తన పార్టీ బలం ఎలా ఉన్నా తెలంగాణా రాజకీయాల్లో పరోక్షంగా చక్రం తిప్పగల సామర్ధ్యం బాబు సొంతం. ఆయనకు ఉన్న సుదీర్ఘ అనుభవం, జాతీయ రాజకీయాల్లో ఉన్న అపరిమిత పరిచయాలు దీనికి దోహదపడుతున్నాయి. చంద్రబాబుతోనే కొన్నేళ్ళ పాటు నడచిన కేసీయార్ 2001లో ఆ పార్టీని వీడి టీయారెస్ స్థాపించి ఆనక ఉద్యమం ద్వారా తెలంగాణా సాధించారు. రెండు టెర్ముల పాటు సీఎం గా ఉంటున్నారు. ఇక మూడవ విడత కూడా గెలవాలన్నది కేసీయార్ ఆరాటం.

అయితే తెలంగాణా కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి చంద్రబాబు నమ్మిన బంటు అని టీయారెస్ అనుమానం. అంతే కాదు, బాబే తన పలుకుబడితో శిష్యుడికి ఈ పదవి ఇప్పించారు అని కూడా పెద్ద డౌట్. మొత్తానికి టీయారెస్ మరీ ముఖ్యంగా కేసీయార్ ఏ రోజూ చంద్రబాబుని అసలు నమ్మరంటే నమ్మరు. ఇంకో వైపు ఏపీలో చూసుకుంటే వైఎస్సార్ జమానా నుంచి చంద్రబాబుతో పడదంటే పడదు. ఇక జగన్ జోరు పెంచేశాక ఇద్దరి మధ్యన ప్రతీ రోజూ యుద్ధమే సాగుతోంది.

ఈ నేపధ్యంలో కేసీయార్ జగన్ హైదరాబాద్ లో ఒక వివాహ వేడుకలో కలిశారు. నిజానికి ఈ ఇద్దరి మధ్యన బంధం ఏంటి అనే దాని కంటే వైరం అయితే లేదు అన్నది మాత్రం కచ్చితంగా చెప్పుకోవచ్చు. జగన్ ఏంటో కేసీయార్ కి తెలుసు. కేసీయార్ గురించి జగన్ కి బాగా అవగాహన ఉంది. ఇక రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలు కానీ ఇతర సమస్యలు కానీ ఇద్దరు మధ్యన స్నేహాలకు ఎపుడూ ఆటంకం అయితే కానే కావు. ఏపీలో జగన్ కాకుండా మళ్ళీ బాబు వస్తే కేసీయార్ కి ఇబ్బందే. అలాగే తెలంగాణాలో బీజేపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా జగన్ కి ఇరకాటం. అందువల్ల ఒకరి మేలు మరొకరు అలా గట్టిగా కోరుకుంటారు.

ఈ క్రమంలో చాలా కాలానికి కలసిన ఇద్దరు మిత్రులు ఏం మాట్లాడుకుని ఉంటారు అన్నదే అందరిలోనూ ఆసక్తి. అయితే వేడి వేడిగా చంద్రబాబు కన్నీరు ఎపిసోడ్ దేశమంతటా చర్చగా ఉంది. దానికి ముందు అసెంబ్లీలో జరిగిన రచ్చ ఇవన్నీ కూడా ఇద్దరు మిత్రుల మధ్యన కచ్చితంగా ప్రస్తావనకు వచ్చి ఉంటాయనే అంటున్నారు. సీనియర్ నేత కాబట్టి కేసీయార్ చంద్రబాబు స్వభావం గురించి తనకు తెలిసిన సమాచారం కూడా జగన్ తో పంచుకుని ఉంటారని కూడా అంటున్నారు. మొత్తానికి ఏది ఏమైనా చంద్రబాబు విషయంలో ఇంకా గట్టిగానే బిగించాలి అన్నదే ఇద్దరు ఆలోచన అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఇద్దరికీ ఉమ్మడి శత్రువు కనుక. మొత్తానికి ఈ ముచ్చట ఇద్దరూ నవ్వుతూ తుళ్ళుతూ కలసిపోవడాలూ చూపరులకు ఎలా ఉన్నాయో కానీ రీసెంట్ గా అసెంబ్లీలో అవమానం పడి అదే హైదరాబాద్ లో ఉంటున్న చంద్రబాబుకు మాత్రం టీవీల్లో వీరిని అలా చూసినపుడు చాలా ఇబ్బందిగానే ఉంటుంది అన్నది వాస్తవం.