Begin typing your search above and press return to search.

మొక్క కదా అని తినేసింది.. మేక అరెస్ట్

By:  Tupaki Desk   |   12 Sep 2019 10:03 AM GMT
మొక్క కదా అని తినేసింది.. మేక అరెస్ట్
X
చెట్టు కనపడగానే మొక్క ఏం చేస్తుంది.? ఆబగా వెళ్లి తింటుంది. కానీ అది హరితహారం మొక్క. ఇప్పుడు నిబంధనలు మారిపోయాయి. మొక్క చచ్చిందా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి పోస్ట్ గోవిందా.? అందుకే మొక్కలు తింటున్న మేకలను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ వింత సంఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో చోటుచేసుకుంది.

పాత కరీంనగర్ పరిధి జిల్లాలోనే ఇప్పటివరకు 10 కోట్లకు పైగా మొక్కలను హరితహారంలో నాటారు. మరి ఆ మొక్కలేవీ? సగం కూడా బతికి బట్టకట్టేలేదు. అన్ని మొక్కలు చెట్లుగా మారితే కరీంనగర్ పచ్చలహారాన్ని పరుచుకునేది. కానీ అధికారులు, గ్రామస్థుల నిర్లక్ష్యం.. మొక్కల సంరక్షణలేక.. పశువులకు ఆహారమై, ఎండకు ఎండి ఇలా 30శాతం మొక్కలు కూడా మొలకెత్తలేదు.

అయితే తాజాగా హరితహారంలో నాటిన మొక్కలు ఎండిపోతే పంచాయతీ సర్పంచ్, కార్యదర్శుల ఉద్యోగాలు ఊడిపోతాయని కొత్త పంచాయతీరాజ్ చట్టంలో కేసీఆర్ కఠిన నిబంధనలు పెట్టారు. దీంతో ఇప్పుడు ప్రజాప్రతినిధులు మేల్కొంటున్నారు. గ్రామంలో మొక్కలను తింటున్న మేకలు, గొర్రెలు, పశువుల యజమానులకు జరిమానాలు విధిస్తూ.. వారితో మొక్కలు నాటిస్తూ సంరక్షణ చర్యలు చేపట్టారు. ఇటీవల కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో మేకలు మొక్కలు తిన్నందుకు వాటి యజమానులకు రూ.1000, రూ.500 చొప్పున జరిమానా కూడా విధించారు.

తాజాగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఓ ఎన్జీవో సంస్థ 900 మొక్కలను నాటింది. అందులో 250 మొక్కలను మేకలు తినేశాయి. మేకల యజమానిని హెచ్చరించినా పట్టించుకోలేదు. మంగళవారం కూడా మేకలు మొక్కలు తినడంతో ఎన్టీవో సంస్థ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించి ఆ మేకలను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాటిపై కేసు పెట్టి అరెస్ట్ చేశారు. వాటి యజమాని దోర్నకొండ రాజయ్య నుంచి జరిమానా వసూలు చేయాలని ఎన్జీవో సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొక్కలను బతికించుకునేందుకు ఏకంగా వాటిని తిన్న మేకలపై కేసు పెట్టి అరెస్ట్ చేసిన వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.