Begin typing your search above and press return to search.

డాక్ట‌ర్లు అనుకున్న‌ది జ‌రిగితే.. రెండు గుండెలు

By:  Tupaki Desk   |   11 Dec 2017 6:02 AM GMT
డాక్ట‌ర్లు అనుకున్న‌ది జ‌రిగితే.. రెండు గుండెలు
X
నిజంగా నిజం. ఒక గుండెకు మ‌రో గుండె తోడుగా నిల‌వ‌టం. విన‌టానికి వింత‌గా ఉన్నా.. బ‌ల‌హీనంగా ఉన్న గుండెకు అండ‌గా నిలిచే స‌రికొత్త ప్ర‌యోగాన్ని చేస్తున్నారు చెన్నై వైద్యులు. వీరి ప్ర‌యోగం స‌క్సెస్ అయితే ఎన్ని గుండెలు అని అడ‌గ‌టం మామూలు ప్ర‌శ్న‌గా మారుతుంది. ఇంత‌కి గుండె ఉన్న‌ప్పుడు మ‌రో గుండె అవ‌స‌రం ఏమిటి? చెన్నై వైద్యులు చేస్తున్న స‌రికొత్త ప‌రిశోధ‌న ఏమిటి? రెండో గుండెను ఎక్క‌డ పెడ‌తారు? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం వెతికితే.. ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

చెన్నై ప్రాంటియ‌ర్ లైఫ్ లైన్ ఆసుప‌త్రికి చెందిన వైద్యుల బృందం స‌రికొత్త త‌ర‌హా ప‌రిశోధ‌న చేస్తోంది. గుండె జ‌బ్బుల‌తో బాధ‌ప‌డే వారికి హార్ట్ ట్రాన్స్ ఫ్లాంట్ చేయ‌కుండా మ‌రో గుండె పెట్టేసేలా ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. త‌మ ప్ర‌యోగాల్లో భాగంగా ఇప్ప‌టికే రెండు కుక్క‌ల‌కు ఈ ప్ర‌యోగాన్ని నిర్వ‌హించారు.

ఇంత‌కీ రెండో గుండె అవ‌స‌రం ఏమిట‌న్న ప్ర‌శ్న‌కు వైద్యులు చెబుతున్న‌దేమంటే.. బ‌ల‌హీన‌మైన గుండె ఉన్న రోగులు చాలామంది హార్ట్ ట్రాన్స్ ఫ్లాంట్ కు ఒప్పుకోరు. అలాంటి వారికి ఒక మెకానిక‌ల్ పంప్ ఏర్పాటు చేసి ర‌క్తం పంప్ స‌ర‌ఫ‌రా అయ్యేలా చేస్తారు. హార్ట్ ట్రాన్స్ ఫ్లాంట్ లో గుండెను కోసి.. మొత్తం బ‌య‌ట‌కు తీసి మ‌రో గుండెను నిర్ణీత స‌మ‌యంలో పెట్టేయాలి. ఇది చాలా రిస్క్ తో కూడుకున్న‌ది. అందుకే.. బ‌ల‌హీనంగా గుండెకు స‌హాయంగా పొత్తి క‌డుపులో మ‌రో గుండెను పెట్టి.. రెండింటికి జ‌త క‌లిపితే స‌రిపోతుంద‌న్న‌ది త‌మ ఆలోచ‌న‌గా చెబుతున్నారు.

ఈ ఏడాది మొద‌ట్లో కోయంబ‌త్తూరు వైద్యులు ఒక రోగికి ఆప‌రేష‌న్ చేస్తూ గుండె సందుల్లో మ‌రో చిన్న గండెను పెట్టి ఈ త‌ర‌హా ప్ర‌యోగం చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

త‌మ ప‌రిశోధ‌న‌ల్లో భాగంగా రెండు కుక్క‌ల‌కు ఇలాంటి ప్ర‌యోగ‌మే చేశారు. ఒక‌టి విఫ‌లం కాగా.. మ‌రొక‌టి స‌క్సెస్ అయ్యింది. దీనిపై మ‌రిన్ని ప్ర‌యోగాలు చేయాల‌ని.. ఇందుకు క్లీనిక‌ల్ టెస్ట్ లు అవ‌స‌ర‌మ‌ని.. మ‌నుషుల‌పై ప్ర‌యోగం చేస్తేనే ఫ‌లితాల‌పై అంచ‌నా ప‌క్క‌గా ఉంటుంద‌ని చెబుతున్నారు. త‌మ ప్ర‌యోగం స‌క్సెస్ అయితే గుండెను కోయ‌కుండానే మ‌రో గుండెతో ప్రాణాలు కాపాడొచ్చంటున్నారు. త‌మ త‌ర్వాతి ప్ర‌యోగాల కోసం ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి కోర‌నున్న‌ట్లు ఆసుప‌త్రి వ‌ర్గాలు చెబుతున్నాయి. అదే జ‌రిగితే.. క‌డుపులో మ‌రో గుండెతో ఆయుష్షును మ‌రింత పెంచుకునే వీలు ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.