Begin typing your search above and press return to search.

సీబీఐ పేరుతో రాయపాటికి బెదిరింపులు

By:  Tupaki Desk   |   19 Jan 2020 7:17 AM GMT
సీబీఐ పేరుతో రాయపాటికి బెదిరింపులు
X
మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావుపై ఇటీవలే సీబీఐ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు అప్పు చేసి ఎగ్గొట్టడంతో ఆయనపై కేసులు నమోదు చేశారు.

అయితే తాజాగా ఢిల్లీలోని సీబీఐ కార్యాలయం నుంచి రాయపాటికి ఫోన్ కాల్స్ వచ్చాయి. తాము సీబీఐ అధికారులమని.. నీ కేసులు మాఫీ చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు కావాలని బెదిరించారు. అంతేకాదు.. గుంటూరు వచ్చి మరీ రాయపాటిని కలిసి డబ్బులివ్వాలని లేదంటే కేసులు మాఫీ చేయమని బెదిరించారట..

దీనిపై అనుమానం వచ్చిన రాయపాటి సాంబశివరావు నేరుగా ఢిల్లీలో వెళ్లి సీబీఐ అధికారులు ఈ విషయంపై ఆరాతీశారు. వాళ్లు నిఘా వేయడంతో అసలు గుట్టు బయటపడింది.

హైదరాబాద్ కు చెందిన మణివర్ణన్ రెడ్డితోపాటు మధురైకి చెందిన సెల్వంలు రాయపాటిని బెదిరించినట్టు సీబీఐ అధికారుల విచారణలో తేలింది. వీరిద్దరూ అత్యాధునిక టెక్నాలజీతో ఢిల్లీ సీబీఐ కార్యాలయం నుంచి ఫోన్ నంబర్ ను మార్ఫింగ్ చేసి ఇలా చేశారు. వారిద్దరిని అరెస్ట్ చేసి వారి ఇళ్లలో తనిఖీలు చేసి అత్యాధునిక సాంకేతిక పరికరాలు.. పెద్ద ఎత్తున సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు రాయపాటినే కాదు సీబీఐ , ఈడీ పేరుతో చాలా మందిని మోసం చేశారని.. డబ్బు గుంజారని సీబీఐ విచారణలో తేలింది.