Begin typing your search above and press return to search.

న‌డిరోడ్డు మీద ప్రాణం పోసిన హోంగార్డులు

By:  Tupaki Desk   |   1 Feb 2018 5:06 AM GMT
న‌డిరోడ్డు మీద ప్రాణం పోసిన హోంగార్డులు
X
ఇద్ద‌రు హోంగార్డులు చేసిన ప‌ని ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఏదో చేశామంటే చేశామ‌న్న‌ట్లు డ్యూటీ చేయ‌కుండా ఒక అప‌రిచిత వ్య‌క్తికి ప్రాణాలు పోసే విష‌యంలో వ్య‌వ‌హ‌రించిన వైనం ఇప్పుడు అంద‌రి ప్ర‌శంస‌లు పొందేలా చేస్తోంది. చివ‌ర‌కు మంత్రి కేటీఆర్ సైతం.. ఆ ఇద్ద‌రు హోంగార్డుల్ని ప్ర‌శంసించ‌ట‌మే కాదు.. వారి చేసిన ప‌నిని సంబంధిత మంత్రికి అటాచ్ చేశారు. ఇంత‌కూ ఆ ఇద్ద‌రు హోంగార్డులు ఏం చేశారు? అన్న‌ది చూస్తే..

చార్మినార్ డివిజ‌న్ కు చెందిన బ‌హ‌దూర్ పుర పోలీస్ స్టేష‌న్లో పని చేసే హోంగార్డుల్లో చంద‌న్ సింగ్‌.. ఇనాయాతుల్లాలు బుధ‌వారం ఉద‌యం పురానాపూల్ ద‌గ్గ‌ర విధులు నిర్వ‌హిస్తున్నారు. జ‌హ‌నుమా వైపు బైక్ మీద వెళుతున్న ఒక వ్య‌క్తి హ‌టాత్తుగా బండి మీద నుంచి కింద‌కు ప‌డిపోయాడు. దీంతో వెంట‌నే స్పందించిన ఇద్ద‌రు హోంగార్డులు అక్క‌డికి వెళ్లారు. శ్వాస తీసుకోవ‌టానికి ఇబ్బంది పడుతున్న విష‌యాన్ని గుర్తించిన హోం గార్డులు వెంట‌నే ప్ర‌థ‌మ‌చికిత్స‌ను అందించే ప్ర‌య‌త్నం చేశారు.

సీపీఆర్ (కార్డియోపల్మనరి రెససిటేషన్‌) ప‌ద్ద‌తిలో శ్వాస తీసుకోలేని వ్య‌క్తి ఛాతీ మీద గ‌ట్టిగా మ‌ర్ద‌న చేయ‌సాగారు. కొన్ని సెకండ్ల‌కు అత‌ను ఊపిరి పీల్చుకున్నారు. జ‌రిగిన వైనాన్ని ఒక‌రు త‌మ సెల్ లో చిత్రీక‌రించారు. దీన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌టంతో ఈ వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది. మీడియాలోనూ.. సోష‌ల్ మీడియాలోనూ వ‌చ్చిన ఈ ఉదంతం ప‌లువురి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

దీనిపై తాజాగా మంత్రి కేటీఆర్ స్పందించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లువురు కానిస్టేబుళ్ల‌కు సీపీఆర్ విధానంపై శిక్ష‌ణ తీసుకోవాల్సి ఉంద‌ని.. అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ప్రాణాలు నిలిపేందుకు సాయం చేస్తుంద‌ని పేర్కొన్నారు. అంతేకాదు.. అప‌త్ స‌మ‌యంలో స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించిన హోంగార్డులు ఇద్ద‌రిని అభినందించిన మంత్రి కేటీఆర్‌.. బ‌హుదూర్ పుర ట్రాఫిక్ ఇన్ స్పెక్ట‌ర్ ఎ.శ్రీ‌నివాస్‌.. న‌గ‌ర ట్రాఫిక్ డీసీపీ ర‌ఘునాథ్ ల‌పైనా ప్ర‌శంస‌లు కురిపించారు. వీరంద‌రి సంగ‌తి ఎలా ఉన్నా.. టైమ్లీలా రియాక్ట్ కావ‌టంలో ఇద్ద‌రు హోంగార్డులు చేసిన ప‌నికి న‌గ‌ర‌జీవులు ఫిదా అవుతున్నారు.