Begin typing your search above and press return to search.

మనల్ని ఏలిన బ్రిటీషనర్లను ఏలే అరుదైన అవకాశం.. బరిలో భారతీయులు

By:  Tupaki Desk   |   11 July 2022 2:19 PM GMT
మనల్ని ఏలిన బ్రిటీషనర్లను ఏలే అరుదైన అవకాశం.. బరిలో భారతీయులు
X
మనల్ని బానిసలుగా మార్చి 200 ఏళ్లకుపైగా పాలించిన బ్రిటీష్ వారిపై ఇప్పుడు మనమే ఆధిపత్యం చెలాయించే అరుదైన అవకాశం దక్కుతోంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ పదవిలో ఎవరు అవుతారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

నిన్న అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలాహారీష్ కావడం మనందరికీ గర్వకారణమైంది. ఇప్పుడు మనల్ని పాలించిన వారినే పాలించేలా బ్రిటన్ ప్రధాని రేసులో భారతీయులు నిలబడడం ఆసక్తి రేపుతోంది.

బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతి వ్యక్తులు పోటీపడుతున్నారు. మన బెంగళూరుకు చెందిన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ అందరికంటే ముందంజలో ఉన్నారు. ఇక ఈయన తర్వాత భారత సంతతి కి చెందిన సుయెల్లా బ్రేవర్ మాన్ కూడా పోటీపడుతున్నారు. ఈమె తండ్రి గోవాకు చెందిన వారు కాగా.. తల్లిది కెన్యా.. ఈమెతోపాటు ప్రీతీ పటేల్ కూడా పోటీపడుతున్నారు.

ఇప్పటి వరకున్న బోరిస్ ప్రభుత్వంలో రిషి సునక్ 2020లో ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. కరోనా విజృంభణ సమయంలో ప్రజలు, ఉద్యోగులకు అండగా అనేక పథకాలను ప్రకటించారు. దీంతో రిషి పాపులర్ వ్యక్తిగా మారారు. ప్రజలు, ఉద్యోగులకు అనుగుణంగా కొన్ని పథకాలు తీసుకురావడంతో దేశంలో ఆయనకు మంచి పేరు ఉంది. 42 ఏళ్ల రిషి బ్రిటన్ ప్రధాని అయితే భారత సంతతికి చెందిన మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు. అయితే ప్రధాని పదవికి పోటీ చేసేందుకు రిషి ఇప్పటికే ఆర్థిక మంత్రి పోస్టుకు రాజీనామా చేశారు.

భారత్ లో ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి అల్లుడైన రిషి సౌతాంప్టన్ లో జన్మించారు. తూర్పు ఆఫ్రికా నుంచి బ్రిటన్ వెళ్లిన ఆయన తల్లిదండ్రులు అక్కడే నివసిస్తున్నారు. రిషి వించెస్టర్ కాలేజీ ప్రైవేట్ స్కూల్ లో చేరి ఆక్స్ ఫర్డ్ లో చదివారు . కన్జర్వేటివ్ పార్టీ తరుపున 2 015లో నార్త్ యార్క్ షైర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. 2019 నుంచి 2020 వరకు బ్రిటన్ ట్రెజరీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సునక్ అప్పటి నుంచి 2022 వరకు ఖజానాకు ఛాన్స్ లర్ గా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటన్, భారత్ సంబంధాలు ఇంకా కొనసాగుతాయని పేర్కొన్నారు.

ప్రీతీ పటేల్ యూకే హొం సెక్రటరీగా కొనసాగారు. బోరిస్ జాన్సన్ కు వ్యతిరేకంగా ఈమె తన పదవికి రాజీనామా చేశారు. రిషి సునక్, బ్రేవర్ మెన్ తో పోలిస్తే ప్రీతికి మద్దతు తక్కువగానే ఉంది.

బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ వైఫల్యానికి పలు కారణాలున్నాయి.బోరిస్ జాన్సన్ తీసుకున్న నిర్ణయాలే కారణమని చెబుతున్నారు.ఇంతకీ ఈ సంక్షోభానికి కారణం వెతికితే.. పార్లమెంట్ సభ్యుడు క్రిస్ పించర్ గా చెప్పాలి. అతడ్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నెత్తిన పెట్టుకోవటం.. అతగాడి పని తీరుతో మొత్తం డిస్ట్రబ్ అవుతుందన్న ఆరోపణలున్నాయి. గతంలో ఆయన్ను ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ విప్ పదవిలో కూర్చోబెడుతూ బోరీస్ జాన్సన్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమైనా పట్టించుకోలేదు. ఇటీవల ఒక క్లబ్ లో తాగిన మత్తులో క్రిస్ పించర్ ఇద్దరు మగాళ్ల విషయంలో తేడాగా వ్యవహరించటం.. దానిపై కంప్లైంట్లు రావటంతో తీవ్ర వివాదానికి కారణమైంది. దీంతో అతడ్ని పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. పించ్ ఇలాంటి వాడని తనకు ముందు తెలియదని బోరిస్ జాన్సన్ తప్పుకునే ప్రయత్నం చేశారు. దీనికి బదులుగా.. పించర్ గురించి తాము ముందే చెప్పినట్లుగా మాజీ అధికారి ఒకరు పేర్కొనటంతో బోరీస్ జాన్సన్ అడ్డంగా బుక్ అయ్యారు. ప్రధాని నోటి నుంచి అసత్యాల నేపథ్యంలో గురి చూసి కొట్టిన బాణంలా.. తన ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో బోరీస్ జాన్సన్ ప్రభుత్వానికి నూకలు చెల్లిన పరిస్థితి.

ఇటీవల కాలంలో బోరీస్ జాన్సన్ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తుందన్న విమర్శ ఉంది. ప్రజలు వేలెత్తే వరకు విషయాన్ని తీసుకెళ్లి.. తర్వాత క్షమాపణలు చెప్పటం ఒక అలవాటుగా మారిందంటున్నారు. తాజా ఎపిసోడ్ లోనూ తనకేమీ తెలీదన్న మాటను చెప్పి.. అనంతరం తప్పు జరిగిందని చెంపలేసుకున్న బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లేనని చెబుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు ఉండటం గమనార్హం.

గత ప్రధాని బోరిస్ నాయకత్వాన్ని 40 మందికి పైగా మంత్రులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బోరిస్ ప్రధాని పదవికి రాజీనామా చేవారు. అయితే కొత్త ప్రధాని ఎన్నికయ్యే వరకు ఆయనే పదవిలో ఉంటారు. వరుస కుంభకోణాలు, ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలు, నిందితులకు రక్షణగా ఉండడంపై ఎప్పటి నుంచి బోరిస్ పై వ్యతిరేకత వస్తోంది. దీంతో ఆయనపై మంత్రులు తిరుగుబాటు చేశారు.

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం.. ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావంతో ప్రభుత్వం కుప్పకూలడానికి కారణమని తెలుస్తోంది. ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించి సాయపడుతానని బోరిస్ జాన్సన్ తెలిపారు. అవే కారణాలు ప్రభుత్వం పతనం కావడానికి కారణమన్నారు.