Begin typing your search above and press return to search.

అమెరికాలో భార‌తీయుల‌కు మ‌రో అరుదైన అవ‌కాశం

By:  Tupaki Desk   |   27 May 2020 1:30 AM GMT
అమెరికాలో భార‌తీయుల‌కు మ‌రో అరుదైన అవ‌కాశం
X
అగ్ర‌రాజ్యం అమెరికాలో భార‌తీయులు స‌త్తా చాటుతున్నారు. వారి ప‌నిత‌నం.. వారి కృషికి త‌గ్గ గుర్తింపు ల‌భిస్తోంది. అన్ని రంగాల్లో భార‌తీయులు రాణిస్తున్నారు. ఈ క్ర‌మంలో మరో ఇద్ద‌రు భార‌తీయులు అరుదైన అవకాశం పొందారు. ప్ర‌స్తుతం మ‌హ‌మ్మారి వైర‌స్‌తో తీవ్రంగా ప్ర‌భావిత‌మై అల్లక‌ల్లోలానికి గుర‌యిన న్యూయార్క్‌ను గాడీన పెట్టేందుకు భార‌తీయుల‌కు కీల‌క బాధ్య‌త‌లు ద‌క్కాయి.

మ‌హ‌మ్మారి వైర‌స్‌తో న్యూయార్క్ రాష్ట్రం అతలాకుత‌ల‌మైంది. ఆ రాష్ట్ర‌ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఈ నేప‌థ్యంలో అక్క‌డి ప్ర‌భుత్వం దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో న్యూయార్క్ ఆర్థిక‌వ్య‌వ‌స్థ‌ను గాడీన పెట్టేందుకు ఓ క‌మిష‌న్ ఏర్పాటుచేశారు. ఈ కమిషన్‌లో ఇద్దరు భారతీయులకు చోటు దక్కింది. వారెవ‌రో కాదు ఒకరు పులిట్జర్‌ విజేత, ఇండియన్‌ అమెరికన్‌ ఫిజీషియన్‌ సిద్ధార్థ ముఖర్జీ, మరొకరు ఉన్నత విద్యావేత్త సతీశ్ త్రిపాఠి. వారిని క‌మిష‌న్‌లో స‌భ్యులుగా నియ‌మిస్తూ న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ క్యూమో ప్రకట‌న విడుద‌ల చేశారు.

వైరస్‌ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న న్యూయార్క్‌ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు 15 మందితో ‘బ్లూ రిబ్బన్‌ కమిషన్‌’ను న్యూయార్క్ ప్ర‌భుత్వం ఏర్పాటుచేసింది. ఈ క‌మిష‌న్‌కు గూగుల్‌ మాజీ సీఈఓ ఎరిక్‌ స్మిత్‌ అధ్యక్షుడిగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈ కమిషన్‌లో ముఖర్జీ, త్రిపాఠితోపాటు రాక్‌ఫెల్లర్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు రిచర్డ్‌ పార్‌సన్స్‌, ఫోర్డ్‌ ఫౌండేషన్‌ ప్రెసిడెంట్‌ డారెన్‌ వాకర్‌, ఐబీఎం అధ్యక్షుడు గిన్ని రొమ్మెటి వంటి వారు ఉన్నారు.