Begin typing your search above and press return to search.

లైన్ క్లియర్ : ఇక ఎన్డీయేలోకి అన్నాడీఎంకే!

By:  Tupaki Desk   |   24 Nov 2017 3:53 AM GMT
లైన్ క్లియర్ : ఇక ఎన్డీయేలోకి అన్నాడీఎంకే!
X
ఇక అవాంతరాలు అన్నీ తొలగిపోయాయి. తమిళనాడులోని ద్రవిడ పార్టీ మరొకటి జాతీయ స్థాయి కూటమిలో చేరబోతోంది. తమిళనాట అధికారంలో ఉన్న అన్నా డీఎంకే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో భాగస్వామి పార్టీగా చేరడానికి ముహూర్తం మరెంతో దూరంలో లేదు. నిజానికి ఆ పార్టీ మోడీ ఆశీస్సులతో నడుస్తూ.. అప్రకటితంగా మోడీ దళంలో సభ్యుల్లాగానే వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అధికారికంగా అన్నాడీఎంకే పార్టీ ఎవరిది అనే సంగతి తేలకపోవడంతో.. మోడీ కూడా.. వారిని భాగస్వాములుగా కలుపుకోకుండా ఎడం పాటిస్తూ వచ్చారు. తాజాగా గుర్తింపు గొడవ కొలిక్కి వచ్చేసింది. పళనిస్వామి- పన్నీర్ వర్గానికి అన్నా డీఎంకే పార్టీ మీద అధికారిక గుర్తింపు దక్కింది. రెండాకులు గుర్తును వారికే కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.

తమిళనాడులో దినకరన్ చీలిక పార్టీ పెట్టుకుని తనదే అసలైన డీఎంకే అని క్లెయిం చేసిన తర్వాత.. తమిళ రాజకీయాలు రసకందాయంలో పడిన సంగతి అందరికీ తెలుసు. పన్నీర్ - పళని వర్గాలు కేంద్రం చొరవతో.. భాజపా ఢిల్లీ పెద్దల సలహాలతో.. ఒక్కటైనప్పుడు.. ఆ పార్టీ ఎన్డీయేలో చేరడం ఖరారు అయిపోయింది. అన్నా డీఎంకే నుంచి కేంద్రమంత్రివర్గంలోకి కూడా తీసుకుంటారనే ప్రచారం జరిగింది. పళని ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతారని, పన్నీర్ కేంద్ర మంత్రి అవుతారనే ప్రచారమూ జరిగింది. అయితే.. పార్టీపై అధికారిక హక్కులు తేలకుండా.. వారిని భాగస్వాములుగా చేర్చుకోవడం తొందరపాటు అవుతుందని మోడీ కూటమి భావించింది.

ఇప్పుడిక రెండాకుల గుర్తు అన్నాడీఎంకే కు రావడంతో.. లైన్ క్లియర్ అయినట్లే. ఈసారి జరిగే ఎన్నికల సమయానికి అన్నాడీఎంకే తో మిత్రపక్షంగా కలిసి బరిలోకి దిగి.. భాజపా కూడా ఎన్నో కొన్ని సీట్లను తమిళనాడులో దక్కించుకోవడానికి వీలుంటుంది. ఆ రాష్ట్రంలో తమకంటూ సొంత ప్రజాబలం ఏమాత్రం లేని వారు.. అన్నాడీఎంకే ఆసరాతో కొంత అస్తిత్వం సంపాదించొచ్చు అని పలువురు అంచనా వేస్తున్నారు.