Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌లో నిఫా.. కాద‌ని తేల్చిన రిపోర్టులు!

By:  Tupaki Desk   |   26 May 2018 4:24 AM GMT
హైద‌రాబాద్‌లో నిఫా.. కాద‌ని తేల్చిన రిపోర్టులు!
X
ఒక్కో సీజ‌న్లో ఒక్కో వైర‌స్ ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు పెంచేలా చేస్తాయి. కొన్నేళ్ల క్రితం స్వైన్ ఫ్లూ పేరుతో యావ‌త్ దేశం వ‌ణికించింది. అయితే.. దానికి ముకుతాడు వేయ‌టంలో భార‌త్ స‌క్సెస్ అయ్యింది. తాజాగా నిఫా పేరుతో మ‌రో వైర‌స్ తెర మీద‌కు రావ‌టం తెలిసిందే. ప‌లు దేశాల్ని వ‌ణికిస్తున్న ఈ వైర‌స్.. భార‌త్‌ లోనూ ఎంట‌రైంద‌ని.. దేవ‌త‌లు న‌డియాడే ప్ర‌దేశంగా చెప్పే కేర‌ళ‌లో.. విజృంభించ‌టం.. దాని బారిన ప‌డి సుమారు 12 మందికి పైగా మ‌ర‌ణించ‌టం క‌ల‌క‌లాన్ని రేపింది.

తాజాగా ఈ వైర‌స్.. హైద‌రాబాద్‌ లోకి అడుగు పెట్టిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. ఒక ప్ర‌ముఖ ఇంగ్లిషు దిన‌ప‌త్రిక‌లో నిఫా వైర‌స్ ల‌క్ష‌ణాలు ఉన్న ఇద్ద‌రు హైద‌రాబాద్ లోని ఆసుప‌త్రిలో చేరిన‌ట్లుగా క‌థ‌నాలు వ‌చ్చాయి. దీంతో.. ఒక్క‌సారిగా ప్ర‌భుత్వ అధికారులు అలెర్ట్ అయ్యారు. అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్న ఇద్ద‌రు రోగుల‌కు సోకింది నిఫా కాదంటూ న‌మూనా ప‌రీక్ష‌లు స్ప‌ష్టం చేయ‌టంతో.. వైద్యాధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

నిఫా ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లుగా అనుమానాలు వ్య‌క్త‌మైన ఇద్ద‌రు కేర‌ళ నుంచి రావ‌టంతో ఆందోళ‌న పెరిగింది. వీరి బ్ల‌డ్ శాంపిల్స్ ను ఫూణేకు అత్య‌వ‌స‌రంగా పంపారు. అయితే.. వారికి నిఫా వైర‌స్ సోక‌లేద‌ని తేల్చారు. శుక్ర‌వారం రాత్రి ఈ ఫ‌లితాలు రావ‌టంతో.. అప్ప‌టి వ‌ర‌కూ టెన్ష‌న్.. టెన్ష‌న్ గా ఉన్న అధికారులు హ‌మ్మ‌య్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు.

నిఫా బారిన ప‌డిన‌ట్లుగా అనుమానించిన ఇద్ద‌రిలో ఒక‌రు ఫీవ‌ర్ ఆసుప‌త్రిలో చేర‌గా.. మ‌రొక‌రు నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. తాజా రిపోర్టులు నిఫా కాద‌ని తేలటం.. నిమ్స్ లో బాదితుడికి బ్రెయిన్ ఫీవ‌ర్ సోకిన‌ట్లుగా గుర్తించి ఐసీయూలో ఉంచి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. ఇక‌.. ఫీవ‌ర్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న వ్య‌క్తి ఆరోగ్యం సైతం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు స్ప‌ష్టం చేస్తున్నారు.

ప‌క్షులు కొరికి పారేసిన ప‌ళ్ల‌ను తిన్న వారికి.. గ‌బ్బిలాలు తిరిగే ప్ర‌దేశాల్లో ల‌భించే ఆహారం.. నీళ్ల‌ను అస్స‌లు తీసుకోకూడ‌దు. అంతేకాదు.. ఎక్కువ‌గా గుంపుల్లో తిర‌గ‌కుండా ఉండ‌టం.. నిఫా ల‌క్ష‌ణాలు ఏవైనా క‌నిపించిన వెంట‌నే నిర్ల‌క్ష్యం చేయ‌కుండా అప్ర‌మ‌త్త‌త‌తో వ్య‌వ‌హ‌రించాల‌ని చెబుతున్నారు.

నిఫా వైర‌స్ సోనిన వారికి జ్వ‌రం.. త‌ల‌నొప్పి.. వాంతులు.. కండ‌రాల నొప్పి.. శ్వాస తీసుకోవ‌టంలో ఇబ్బందులు ఉంటాయ‌ని.. మ‌త్తుగా ఉండ‌టంతో కొంద‌రిలో మూర్ఛ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయ‌ని చెబుతున్నారు. ఈ ల‌క్ష‌ణాలు 10 నుంచి 12 రోజుల వ‌ర‌కూ ఉంటాయ‌ని చెబుతున్నారు.

నిఫా బారిన ప‌డిన రోగి నెమ్మ‌దిగా కోమాలోకి వెళ్లిపోతారు. దీన్ని నియంత్రించేందుకు ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి టీకాలు అందుబాటులో లేవు. దీని బారిన ప‌డ‌కుండా చూసుకోవ‌ట‌మే ముఖ్య‌మ‌ని చెప్పాలి. నిఫా వైర‌స్ విరుచుకుప‌డుతున్న వేళ‌.. హైద‌రాబాద్‌లోని ప‌లు ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ప్ర‌త్యేక వార్డుల్ని ఏర్పాటు చేశారు. నిఫా వైర‌స్ ల‌క్ష‌ణాలున్న‌ట్లుగా అనుమానించిన వారికి ప్ర‌త్యేక వైద్య ఏర్పాట్లు చేసి.. వారిలో వైర‌స్ ఉందా? లేదా? అన్న‌ది తేల్చాల‌ని నిర్ణ‌యించారు. ప్ర‌జ‌ల్లో ఈ వైర‌స్ మీద మ‌రింత అవ‌గాహ‌న పెంచేందుకు వీలుగా ఎయిర్ పోర్టులు.. బ‌స్టాండ్లు.. రైల్వే స్టేష‌న్ల‌లో ప్ర‌త్యేక శిబిరాల్ని ఏర్పాటు చేశారు. మొత్తంగా చూస్తే..కేర‌ళ‌ను వ‌ణికిస్తోన్న నిఫా వైర‌స్.. హైద‌రాబాద్‌కు చేరింద‌న్న సందేహాలు అంద‌రిని ఉలిక్కిప‌డేలా చేశాయి. తాజాగా ఫుణే నుంచి వ‌చ్చిన రిపోర్టుల‌తో సందేహాలు తొలిగి.. హాయిగా ఊపిరి పీల్చుకునే ప‌రిస్థితి.