Begin typing your search above and press return to search.

ఆ ఇద్ద‌రి ఇగోనే ఏపీకి శాప‌మ‌ట‌!

By:  Tupaki Desk   |   15 March 2018 4:41 AM GMT
ఆ ఇద్ద‌రి ఇగోనే ఏపీకి శాప‌మ‌ట‌!
X
విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీకి జ‌రిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అంద‌రి నోటా అదే మాట‌. విభ‌జ‌న ఉద్య‌మం జ‌రిగిన రోజుల్లో తెలంగాణ ప్రాంతం ప‌ట్ల ఎలాంటి సానుకూల‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారో.. అదే త‌ర‌హా సానుకూల‌త ఇప్పుడు ఏపీ ఇష్యూస్ మీద క‌నిపిస్తోంది. ఏపీకి ఇవ్వాల్సిన ప్ర‌త్యేక హోదా మొద‌లు విభ‌జ‌న హామీలు ఎన్నింటినో కేంద్రం ప‌క్క‌న ప‌డేయ‌టంపై ఇప్పుడు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఏపీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి.. హామీల అమ‌లుకు ఉన్న ఇబ్బంది ఏమిటి? అడ్డంకిగా మారిన అంశాలు ఏమిటి? అన్న‌ది ప్ర‌శ్న‌లుగా మారాయి. ఏపీ విష‌యంలో మోడీ స‌ర్కారు ఎందుకంత మొండిగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న అంశంపై తాజాగా ఆస‌క్తిక‌ర ప‌రిణామం ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది.

గ‌డిచిన కొద్దిరోజులుగా ఏపీకి ఇచ్చిన హామీల అమ‌లు కోసం ఆ రాష్ట్ర ఎంపీలు పార్ల‌మెంటులో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. బుధ‌వారం సైతం ఇదే రీతిలో పార్ల‌మెంటులో ఆందోళ‌న నిర్వ‌హించారు. ఏపీ ఎంపీల పుణ్య‌మా అని స‌భ వాయిదా ప‌డింది. ఈ సంద‌ర్భంగా.. మొద‌టివ‌రుస‌లో కూర్చునే కేంద్ర‌మంత్రి ఒక‌రు ఏపీ ఎంపీల‌ను త‌న వ‌ద్ద‌కు పిలిచారు.

ప్ర‌ధానిగా చంద్ర‌బాబు కూర్చున్నా ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేర‌ని ఆయ‌న చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. స‌ద‌రు కేంద్ర‌మంత్రి వ‌ద్ద‌కు వెళ్లిన ఎంపీలు తోట న‌ర‌సింహం.. అవంతి శ్రీ‌నివాసులకు స‌ద‌రు కేంద్ర‌మంత్రి చెప్పిన అంశాలు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. చంద్ర‌బాబు అంటే త‌న‌కు చాలా అభిమానం ఉంద‌ని.. ఆయ‌న వైఖ‌రిని తాను త‌ప్పు ప‌ట్ట‌న‌ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. తాను కానీ కీల‌క‌స్థానంలో కూర్చొని ఉంటే ఏపీ స‌మ‌స్య‌ల్ని ఇట్టే ప‌రిష్క‌రించి ఉండేవాడిన‌ని చెప్ప‌ట‌మే కాదు.. ఇద్ద‌రి ఇగో కార‌ణంగా ఏపీ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావ‌టం లేద‌న్న వ్యాఖ్య ఆయ‌న చేయ‌టం విశేషం. ఇంత‌కీ ఆ ఇద్ద‌రు ఎవ‌రు? వారి మ‌ధ్య ఇగో రావ‌టానికి దారి తీసిన ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.