Begin typing your search above and press return to search.

ప్రణయ్ హత్య కేసులో ఇద్దరు మిస్సింగ్.?

By:  Tupaki Desk   |   25 Sep 2018 6:37 AM GMT
ప్రణయ్ హత్య కేసులో ఇద్దరు మిస్సింగ్.?
X
మిర్యాల గూడలో ప్రణయ్ ను కిరాతకరంగా చంపించిన కేసులో కొన్ని నిజాలు దాచేశారనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన నిందితుడు అమృత తండ్రి మారుతీరావుతో పాటు హత్య చేసిన ఉదంతంలో బీహార్ కు చెందిన కిల్లర్ సుభాష్ శర్మ - కుట్రకు తెరవెనుక ప్లాన్ చేసిన అస్గర్ అలీ - మహ్మద్ అబ్దుల్ బారీ - ఎండీ కరీం - తిరునగురు శ్రవణ్ - సుమద్రాల శివలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో కిడ్నాప్ కు ప్రయత్నించిన ఇద్దరు యువకులను తప్పించారన్న ప్రశ్న ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ప్రణయ్ హత్యకు మారుతీరావు ఇంతకుముందే రెండు సార్లు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. అయితే అది సఫలం కాలేదని వివరించారు. పక్కా ప్రణాళికతో ప్రణయ్ - అమృత కదలికలపై కన్నేసిన నిందితులు బ్యూటీ పార్లర్ కు వచ్చే అమృతను కిడ్నాప్ చేసి ప్రణయ్ ను హత్య చేయాలని ఇదివరకే స్కెచ్ గీశారని పోలీసులు తెలిపారు. అయితే ప్రణయ్ తోపాటు బ్యూటీపార్లర్ కు అతడి సోదరుడు కూడా రావడంతో ప్రణయ్ ఎవరో అందులో గుర్తుపట్టలేక ఇద్దరు నిందితులు వెనక్కి తగ్గారని పోలీసులు తెలిపారు. అందుకే ఈ హత్య ప్లాన్ విఫలమైందని పోలీసులు ప్రకటించారు. అయితే కిడ్నాప్ - హత్య కోసం ఆ ఇద్దరు యువకులను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారని బిహారీ కిల్లర్ సుభాష్ శర్మ పోలీసుల ఎదుట నిజం బయటపెట్టాడు. వారు ఫుల్లుగా మద్యం తాగి ఉండడంతో అప్పుడు ప్లాన్ వర్కవుట్ కాలేదని వివరించారు. దీంతో కుట్రదారు అస్గర్ అలీ ఈ హత్య నుంచి ఆ యువకులను తప్పించాడని పోలీసుల విచారణలో తెలిపాడు.

కాగా హైదరాబాద్ నుంచి వచ్చి అమృత కిడ్నాప్ - ప్రణయ్ హత్యకు కుట్ర చేసిన ఆ ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేయలేదని సమాచారం. వారు ఏమయ్యారు? ఎందుకు ఈ కేసులో అరెస్ట్ చేయలేదనే ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది. దీనిపై స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.