Begin typing your search above and press return to search.

ఉత్త‌మ్ రాజీనామాతో మొద‌లై.. రోహిత్ ఎంట్రీతో పూర్తి!

By:  Tupaki Desk   |   7 Jun 2019 5:51 AM GMT
ఉత్త‌మ్ రాజీనామాతో మొద‌లై.. రోహిత్ ఎంట్రీతో పూర్తి!
X
ఆస‌క్తిక‌ర అంశంగా దీన్ని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికార టీఆర్ ఎస్ లో విలీన ప్ర‌క్రియ సంపూర్ణ‌మైన విష‌యం తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో ఇద్ద‌రు పైలెట్లు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌టం విశేషం. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఒక పైలెట్ పార్టీ విలీనాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తే.. మ‌రో పైలెట్ ఎంట్రీతో విలీన ఎపిసోడ్ విజ‌య‌వంతంగా పూర్తి అయ్యింద‌ని చెప్పాలి. విలీనం మొత్తంలో విచిత్రంగా అనిపించే ఈ పైలెట్ల లెక్కేమిటో చూస్తే.. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ లోకి చేరేందుకు డిసైడ్ కావ‌టంతో కాంగ్రెస్ ను త‌మ‌లో విలీనం చేసుకోవాల‌న్న కేసీఆర్ క‌ల పూర్తి అయ్యింది. ద‌శ‌ల వారీగా 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని జ‌మ చేసిన‌ప్ప‌టికీ.. కీల‌క‌మైన మ‌రో ఎమ్మెల్యే అవ‌స‌రం నేప‌థ్యంలో తాండూరు ఎమ్మెల్యే తెర మీద‌కు రావ‌టంతో విలీన ప్ర‌క్రియ విజ‌య‌వంతంగా పూర్తి అయ్యింది. అదే స‌మ‌యంలో విలీనాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించే మ‌రో పైలెట్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయ‌టం విశేషం. భిన్న ధ్రువాలుగా ఉన్న ఈ ఇద్ద‌రు పైలెట్లు ఎవ‌రంటే?

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.. రోహిత్ రెడ్డిలు ఇద్ద‌రూ పైలెట్లే. ఇరువురు త‌మ కెరీర్ కు పుల్ స్టాప్ పెట్టేసి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. వీరిద్ద‌రు 2018 చివ‌ర్లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ అసెంబ్లీలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అత్య‌ధికుల్ని త‌మ పార్టీలో చేర్చుకోవ‌టం ద్వారా కాంగ్రెస్ ఉనికిని ప్ర‌శ్నార్థ‌కం చేయాల‌న్న ఆలోచ‌న కేసీఆర్ చేశారు.

ఇందుకు అవ‌స‌ర‌మైన 13 మంది ఎమ్మెల్యేల కోసం వేట మొద‌లెట్టారు. ద‌శ‌ల వారీగా 11 మంది ఎమ్మెల్యేల్ని టీఆర్ ఎస్ లోకి చేరేందుకు ఒప్పించారు. మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేల అవ‌స‌రం ఉన్న వేళ‌.. అస‌లు గేమ్ షురూ అయ్యింది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎంపీగా విజ‌యం సాధించిన ఉత్త‌మ్ కుమార్ రెడ్డి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో.. ఒక్క ఎమ్మెల్యే ఓకే అంటే కాంగ్రెస్ పార్టీ విలీన కార్య‌క్ర‌మం విజ‌యవంతంగా పూర్తి అవుతుంది.

ఈ స‌మ‌యంలో అనూహ్యంగా ఒక‌ప్పుడు టీఆర్ ఎస్ పార్టీ నుంచి స‌స్పెన్ష‌న్ వేటు ప‌డిన తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి టీఆర్ ఎస్ లో చేరేందుకు ఓకే చెప్ప‌టంతో విలీన కార్య‌క్ర‌మం వాయు వేగంతో పూర్తి అయ్యింది. కాంగ్రెస్ విలీనానికి అవ‌స‌ర‌మైన ఇద్ద‌రు ఎమ్మెల్యేల సంఖ్య‌ను ఒక పైలెట్ అయిన ఉత్త‌మ్ రాజీనామాతో 12గా మారితే.. మ‌రో పైలెట్ అయిన రోహిత్ రెడ్డి గులాబీ పార్టీలో చేరేందుకు ఓకే అన‌టంతో విలీనం పూర్తి అయ్యింది. మొత్తంగా ఇద్ద‌రు పైలెట్లు కాంగ్రెస్ విలీనంలో కీల‌క భూమిక పోషించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.