Begin typing your search above and press return to search.

రెండంతుస్తుల ఇంటిని పైకెత్తేశారు

By:  Tupaki Desk   |   20 Dec 2015 7:40 AM GMT
రెండంతుస్తుల ఇంటిని పైకెత్తేశారు
X
రెండంతస్తుల మేడ.. మూడడుగుల ఎత్తు లేచింది. మేడపైకి లేవడమేంటని కంగారు పడకండి. దానికదే లేవలేదు.. ఓ ఇంజినీరు ఆలోచన దాన్ని పైకి లేచేలా చేసింది. అవును.... రోడ్డు కంటే పల్లంగా మారిపోయిన ఇంటిని మళ్లీ రోడ్డు కంటే ఎత్తులో ఉండేలా చేసేందుకు ఓ విశ్రాంత ఇంజినీరు చేసిన ప్రయత్నమిది. గుంటూరు జిల్లాలో ఇప్పుడు ఇది హాట్ టాపిక్. ఆంధ్ర ప్రదేశ్ లో ఇంతవరకు ఇలాంటి ప్రయత్నం ఎవరూ చేయకపోవడం... ఇలా చేయొచ్చని చాలామందికి తెలియకపోవడంతో ఆ ఇంటిని చూడ్డానికి ప్రతి రోజూ వందల మంది వస్తున్నారట. అలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నవారంతా మనమూ అలాగే చేయించుకుంటే బాగుంటుంది కదా అనుకుంటూ ఎంత ఖర్చవుతుంది... ఎన్నాళ్లు పడుతుంది... కూలిపోదు కదా? వంటి ప్రశ్నలు అడుగుతూ ఎంతో ఆసక్తి చూపుతున్నారు.

గుంటూరు నగరంలోని ఏటీ అగ్రహరం తొమ్మిదో వీధిలో ఉంటున్న రిటైర్డు ఇంజినీరు జీవీ శేషగిరిరావు 1989 లో రెండంతస్తుల మేడను నిర్మించుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆ వీధిలో సిమెంట్ రహదారి నిర్మించడంతో ఆయన ఇల్లు రహదారి కంటే మూడంగుళాల పల్లమైంది. దీంతో ఇంట్లో డ్రైనేజీ నీరు బయటకు వెళ్లడం లేదు. వర్షమొచ్చినప్పుడు నీళ్లు ఇంట్లోకి వచ్చి బయటకు వెళ్లక పోవడం జరుగుతోంది. ఈ రెండు సమస్యలనుంచి విముక్తి పొందేందుకు ఆయన ఓ వినూత్న ఆలోచనతో చెన్నైకు చెందిన జేజే బిల్డింగ్ లిఫ్టింగ్ సర్వీసెస్ ను సంప్రదించారు. దీంతో సంస్థకు చెందిన ప్రతినిధులు గత నెల 26న తేదీ గుంటూరు వచ్చి పనులు ప్రారంభించారు. జాకీల సహయంతో బెల్టుతో సహ ఇంటిని పైకి లేపి కింద భాగంలో గోడను నిర్మించారు. ఇంకో నాలుగు రోజుల్లో బిల్డింగ్ ఎత్తుకు పెంచే పనులన్నీ పూర్తవుతాయని శేషగిరిరావు చెప్తున్నారు. దీని కోసం రూ.5 లక్షలు వెచ్చిస్తున్నట్లు ఆయన చెప్పారు.