Begin typing your search above and press return to search.

12 ఏళ్ల విద్యార్థి చేసిన ఆ ప‌నికి ఇద్ద‌రు టీచ‌ర్లు స‌స్పెండ్!

By:  Tupaki Desk   |   8 Aug 2022 8:45 AM GMT
12 ఏళ్ల విద్యార్థి చేసిన ఆ ప‌నికి ఇద్ద‌రు టీచ‌ర్లు స‌స్పెండ్!
X
ఝార్ఖండ్ రాష్ట్రంలో గోడ్డా జిల్లాలోని భిఖియఛక్‌ గ్రామంలో ఒక 12 ఏళ్ల పిల్లాడు చేసిన ప‌నికి ఇద్ద‌రు టీచ‌ర్లు సస్పెండ‌య్యారు. ఇంత‌కూ ఆ పిల్లాడు ఏం చేశాడ‌నేగా మీ సందేహం. ఆ గ్రామంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో సర్ఫరాజ్ 12 ఏళ్ల పిల్లాడు చ‌దువుకుంటున్నాడు. అయితే ఆ స్కూళ్లో ఎన్నో స‌మ‌స్య‌లు ఉన్నాయి. దీనికితోడు ఉపాధ్యాయులు కూడా పాఠ‌శాల‌కు స‌రిగా హాజ‌రుకావ‌డం లేదు.

దీంతో అత‌డు త‌మ విద్యార్థులు స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తేవాల‌నుకున్నాడు. అంతే తానే ఒక మీడియా రిపోర్ట‌ర్ లాగా మారిపోయాడు. ఓ కర్రకు ఖాళీ ప్లాస్టిక్‌ బాటిల్‌ తగిలించి దాన్నే మైక్‌గా ఫీల‌వుతూ.. పాఠశాల అంతా తిరుగుతూ అక్కడ ఉన్న స‌మ‌స్య‌లు, విద్యార్థులు ప‌డుతున్న బాధ‌ల‌న్నింటినీ వివరించాడు. ఇదంతా మ‌రో విద్యార్థి వీడియో తీశాడు. ఇది సోష‌ల్ మీడియాలో వైరల్‌ కావడంతో అటుతిరిగి.. ఇటు తిరిగి ఉన్నతాధికారుల దృష్టికి చేరింది.

దీంతో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. అంతేకాకుండా పాఠశాలలో సమస్యల ప‌రిష్కారానికి ఆదేశాలిచ్చారు. త‌మ పాఠశాలలో విద్యార్థులకు తాగడానికి నీరు కూడా లేద‌ని.. పాఠశాల ఆవరణ అంతా పిచ్చి మొక్కలు పెరిగిపోయాయ‌ని విద్యార్థి స‌ర్ఫ‌రాజ్ ఆ వీడియోలో వివ‌రించాడు.

అలాగే మరుగుదొడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయ‌ని.. తరగతి గదుల్లో పశువుల మేతను పడేస్తున్నార‌న్నాడు. ఉపాధ్యాయులు విధులకు సరిగా రాకపోవడంతో విద్యార్థులు కూడా పాఠ‌శాల‌కు హాజ‌రుకావ‌డం లేద‌ని ఆ వీడియోలో స‌మ‌స్య‌ల‌ను ఏక‌ర‌వు పెట్టాడు. ఇప్పుడు మధ్యాహ్నం 12.45 అవుతున్నా టీచర్లు స్కూల్‌కు రాలేదంటూ తమ పాఠశాలలోని దుస్థితిని ఒక మీడియా రిపోర్ట‌ర్ మాదిరిగా చక్కగా ఆ వీడియోలో వివరించాడు.

అంతేకాకుండా మీడియా రిపోర్ట్ ప్ర‌శ్నించిన‌ట్టు తోటి విద్యార్థిని నువ్వు పాఠశాలకు ఎందుకు రోజూ రావడం లేదని ఆ వీడియోలో ప్ర‌శ్నించాడు. అందుకు ఆ చిన్నారి బడిలో మరుగుదొడ్లు దారుణంగా ఉన్నాయని, తాగునీరు కూడా లేదని.. అందుకే స‌రిగా తాను పాఠ‌శాల‌కు రావ‌డం లేద‌ని చెప్పడం వీడియోలో క‌నిపిస్తోంది. ఈ వీడియోను ఓ వ్యక్తి సోష‌ల్ మీడియాలో షేర్‌ చేయడంతో నెటిజన్ల దృష్టికి వెళ్లింది. దీనిపై జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారి రజినీ కుమారి స్పందించారు. వెంటనే పాఠశాలకు సంబంధించిన ఇద్దరు టీచర్లను సస్పెండ్‌ చేశారు. అక్కడి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

మ‌రోవైపు బుల్లి రిపోర్టర్ అవ‌తార‌మెత్తిన 12 ఏళ్ల బాలుడు స‌ర్ప‌రాజ్ పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిజమైన పాత్రికేయులకు ఏమాత్రం తీసిపోకుండా అతడు సమస్యలను కళ్లకు కట్టినట్టు వివ‌రించాడ‌ని నెటిజ‌న్లు అభినందిస్తున్నారు.