Begin typing your search above and press return to search.

రెండు సార్లు T20 చాంపియన్ వెస్టిండీస్ ఔట్.. గేల్ ఆశలు అడియాసలు

By:  Tupaki Desk   |   21 Oct 2022 10:30 AM GMT
రెండు సార్లు T20 చాంపియన్ వెస్టిండీస్ ఔట్.. గేల్ ఆశలు అడియాసలు
X
టీ20 ఆట అంటేనే మొదట విండీస్ ఆటగాళ్లు గుర్తుకువస్తారు. వన్డే, టెస్టుల కంటే కూడా ఈ టీం ఆటగాళ్లు టీ20ల్లో మెరుపు వీరులుగా గుర్తించబడ్డారు. ఆల్ రౌండర్లు, హార్డ్ హిట్టర్లతో వెస్టిండీస్ భీకరంగా ఉండేది. కానీ ఇప్పుడు వెస్టిండీస్ తేలిపోయింది. క్రిస్ గేల్, పోలార్డ్, బ్రావో, అండ్రూ రస్సెల్ , సునీల్ నారాయణ్ లాంటి దిగ్గజ క్రికెటర్లు రిటైర్ మెంట్, గాయాలతో వైదొలగడంతో వెస్టిండీస్ జట్టు సాధారణ జట్టుగా మారిపోయింది.

టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ రౌండ్లలో వెస్టిండీస్ చిత్తుగా ఓడి కనీసం సూపర్ 12కు చేరకుండా అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించింది. అసలు కప్ కొడుతుందనుకున్న టీం ఇలా క్వాలిఫై కాకుండా కథ ముగియడమే ఇప్పుడు అందరూ ఇది వెస్టిండీస్ టీంయేనా అని డౌట్ పడుతున్నారు.

టీ20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ కథ ముగిసింది. కీలకమైన డూ ఆర్ డై మ్యాచ్ లో ఐర్లాండ్ చేతిలో వెస్టిండీస్ జట్టు దారుణంగా ఓడి ఇంటిదారి పట్టింది. వెస్టిండీస్ పై ఐర్లాండ్ ఏకంగా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చిత్తుగా విండీస్ ను ఓడించి సూపర్ 12లోకి ఐర్లాండ్ క్వాలిఫై అయ్యింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లను ఎదుర్కోవడంలో వెస్టిండీస్ జట్టు విఫలమై తక్కువ స్కోరుకే పరిమితమైంది.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఐర్లాండ్ రెచ్చిపోయింది. 147 పరుగుల టార్గెట్ ను ఓపెనర్లు, వన్ డౌన్ బ్యాట్స్ మెన్ కలిసి ఛేదించి విండీస్ బౌలర్లను ఉతికి ఆరేశారు. విండీస్ ను చిత్తుచిత్తుగా బాదేశారు. ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఐర్లాండ్ ఈజీగా విండీస్ పై గెలిచేసింది.

టోర్నీ ప్రారంభానికి ముందు వెస్టిండీస్ జట్టు ఏకంగా ఫైనల్ చేరుతుందని.. ఆస్ట్రేలియాతో ఫైనల్ లో తలపడేది విండీస్ జట్టు అని ఆ దేశ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ ధీమాగా చెప్పాడు. కానీ విండీస్ ఆటగాళ్లు గేల్ ప్రిడక్షన్ ను తప్పు చేస్తే ఏకంగా క్వాలిఫై కాకుండానే ఇంటిదారి పట్టి ఘోర అవమానకర ఓటమిని ఎదుర్కొన్నారు. అరవీర భయంకర విండీస్ జట్టును చూస్తే అసలు టీం ఇదేనా? అన్న డౌట్ రాకమానదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.