Begin typing your search above and press return to search.

10 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు టీకాలు వేశారు.. అతడికి ఎలా ఉందంటే?

By:  Tupaki Desk   |   23 Jun 2021 7:30 AM GMT
10 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు టీకాలు వేశారు.. అతడికి ఎలా ఉందంటే?
X
వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఈ మధ్యన చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. విన్నంతనే గుండెలు అదిరే ఉదంతాలు వరుస పెట్టి చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి హైదరాబాద్ లోని మెహదీపట్నంలో చోటు చేసుకుంది. సీతారాంబాగ్ కు చెందిన 47 ఏళ్ల గోపాల్ సింగ్ ఉదంతం గురించి తెలిస్తే టెన్షన్ పడాల్సిందే. అసలేం జరిగిందంటే..

గోపాల్ సింగ్ టీకా వేయించుకోవటానికి విజయనగర్ కాలనీలోని వెట్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో మొదటి డోస్ వేసుకోవటానికి వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం2.45 గంటల వేళలో అతగాడికి కోవిషీల్డ్ టీకా వేశారు. ఆ వెంటనే.. తనకు అవసరమైన ట్యాబ్లెట్లు తీసుకోవటానికి పక్క కౌంటర్ కు వెళ్లాడు. పది నిమిషాలు అక్కడే ఉన్నారు. ఈ లోపు అక్కడ టీకా వేస్తున్న నర్సు ఒకరు అతని వద్దకు వచ్చారు.

మీకు బీపీ.. షుగర్ ఉన్నాయా? అని ఆరా తీశారు. అలా మాట్లాడుతూనే.. రెండో టీకా వేసేసినట్లుగా బాధితుడు వాపోతున్నాడు. రెండోసారి ఇంజక్షన్ పట్టుకొని వస్తే.. ఇంకోటి ఏదైనా ఇస్తున్నారని తాను భావించినట్లు చెబుతున్నారు. పది నిమిషాల వ్యవధిలో రెండు టీకాలు వేయించుకున్న వైనాన్ని అధికారులకు చెప్పారు.

దీంతో.. కంగారు పడ్డ వారు.. అరగంట పాటు గోపాల్ సింగ్ ఆరోగ్యాన్ని అబ్జర్వ్ చేశారు. ఎలాంటి మార్పులు లేకపోవటంతో అతని ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి.. ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి ఇంటికి పంపారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. ప్రస్తుతానికి గోపాల్ సింగ్ బాగున్నట్లు చెబుతున్నారు.