Begin typing your search above and press return to search.

మోడీ అడ్డాలో ఇద్ద‌రు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు

By:  Tupaki Desk   |   3 July 2019 5:18 AM GMT
మోడీ అడ్డాలో ఇద్ద‌రు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు
X
ప్రఖ్యాత పుణ్య‌క్షేత్రం.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వార‌ణాసిలో సంచ‌ల‌న ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇద్ద‌ర‌మ్మాయిలు శివాల‌యంలో పెళ్లి చేసుకున్న వైనం ఇప్పుడు అక్క‌డ హాట్ టాపిక్ గా మారింది. నిత్యం యాత్రికులు.. భ‌క్తుల‌తో ర‌ద్దీగా ఉండే వార‌ణాసిలోని రొహ‌నాకిగా ప్రాంతానికి చెందిన శివాల‌యానికి ఆటోలో ఇద్ద‌రు అమ్మాయిలు వ‌చ్చారు.

చాలాసేపు ఆల‌యంలోనే ఉండిపోయిన ఆ అమ్మాయిలు ఇద్ద‌రూ.. త‌ర్వాత పూజారి వ‌ద్ద‌కు వెళ్లి.. త‌మ‌కు పెళ్లి చేయాల‌ని కోరారు. దీంతో.. ఆశ్చ‌ర్య‌పోయిన పూజారి వారిద్ద‌రికి పెళ్లి చేసేందుకు ఒప్పుకోలేదు. త‌ర్వాత వారికి పెళ్లి చేసేందుకు స‌ద‌రు పూజారి ఓకే చేశారు. జీన్స్ ఫ్యాంట్.. టీష‌ర్ట్ వేసుకొని వ‌చ్చిన ఈ ఇద్ద‌రి పెళ్లి సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర అంశాలు చోటు చేసుకున్నాయి.

ఇద్ద‌రు అమ్మాయిల్లో ఒక‌రిని అబ్బాయిగా అలంక‌రించారు. స‌ద‌రు అమ్మాయి చున్నీ క‌ప్పుకుంది. ఒక యువ‌తి మ‌రో యువ‌తికి మంగ‌ళ‌సూత్రం క‌ట్టారు. పూల‌మాల‌లు వేసుకున్నారు. పెళ్లి త‌ర్వాత అమ్మాయిలు ఇద్ద‌రూ పూజారికి ద‌క్షిణ చెల్లించుకున్నారు.

అమ్మాయిలు ఇద్ద‌రూ పెళ్లి చేసుకున్న కార్య‌క్ర‌మాన్ని గుడికి వ‌చ్చిన ప‌లువురు సెల్ ఫోన్ల‌తో వీడియోలు తీసుకున్నారు. ఇంత‌కీ ఆ అమ్మాయిలు వార‌ణాసికి చెందిన వారు కాద‌ని.. వారిలో ఒక‌రిది సుంద‌ర్ పూర్ కాగా.. మ‌రొక‌రిది కాన్పూర్ గా చెబుతున్నారు. వీరిద్ద‌రూ చ‌దువుకునే క్ర‌మంలో ప‌రిచ‌య‌మై.. పెళ్లి చేసుకున్న‌ట్లుగా చెబుతున్నారు.