Begin typing your search above and press return to search.

కెనడాలో కొత్త నిబంధన అమల్లోకి.. విదేశీయులకు షాక్..!

By:  Tupaki Desk   |   2 Jan 2023 7:29 AM GMT
కెనడాలో కొత్త నిబంధన అమల్లోకి.. విదేశీయులకు షాక్..!
X
కెనడాలో ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్థానికులు సైతం అక్కడ ఇళ్లు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొనడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే విదేశీయులు కెనడాలో రెండేళ్ల పాటు ఇళ్లు కొనుగోలు చేయడం నిషేధం విధించింది. ఈ నిబంధన ఆదివారం నుంచే అమల్లోకి వచ్చింది.

కెనడాలో 2021లో ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాని రేసులో ఉన్న జస్టిన్ ట్రూడో ఎన్నికల హామీగా విదేశీయులు కెనడాలో రెండేళ్లపాటు ఇళ్లు కొనుగోలు చేయకుండా నిషేధం విధిస్తానని హామీ ఇచ్చారు. కెనడాలో వ్యాపారులు.. సంపన్నులు.. కార్పొరేట్లు.. విదేశీ పెట్టుబడిదారులకు దేశంలోని ఇళ్లు లాభసాటిగా మారాయని లిబరల్ పార్టీ అంచనా వేసింది.

ఈ కారణంగానే ఖాళీ ఇళ్లు.. స్పెక్యులేషన్.. ధరలు భారీగా పెరిగినట్లు పేర్కొంది. ఆ ఎన్నికల్లో లిబరల్ పార్టీ గెలుపొందడంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విదేశీయులు కెనడాలో రెండేళ్లపాటు ఇళ్లు కొనుగోలు చేయకుండా నిషేధం విధించింది. ఈ కొత్త చట్టంలో శరణార్థులు.. పర్మినెంట్ రెసిడెంట్స్ కు మాత్రం మినహాయింపు కల్పించింది.

ఈ నిబంధన కేవలం నివాస గృహాలకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. రిక్రియేషన్ ఆస్తులకు ఈ నిబంధనలు వర్తించవని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అదేవిధంగా వాంకోవర్.. టొరెంటో వంటి నగరాల్లో ఖాళీగా ఉన్నటువంటి పాట్లపై సర్కార్ భారీగా పన్నులు విధించడం మొదలెట్టింది. ఈ చర్యలతో రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇళ్ల ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.

ఒకప్పుడు 8 లక్షల డాలర్లు ఉన్న ఇళ్లు ప్రస్తుతం ఆరున్నర లక్షల డాలర్లకు పతనమైంది. అయితే ద్రవ్యోల్బణం కట్టడిలో భాగంగా ప్రభుత్వం వడ్డీ రేట్లను పెంచడం మాత్రం ఇళ్ల కొనుగోలుకు అడ్డంకిగా మారింది.

మరోవైపు కెనడాలో విదేశీయుల చేతిలో కేవలం 5 శాతం ఇళ్లు మాత్రమే ఉన్నాయి. దీంతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వబోవని నిపుణులు అంచనా వేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.