Begin typing your search above and press return to search.

జగన్ పాలనకు రెండేళ్లు: సోషల్ మీడియాలో ట్రెండింగ్

By:  Tupaki Desk   |   30 May 2021 6:11 AM GMT
జగన్ పాలనకు రెండేళ్లు: సోషల్ మీడియాలో ట్రెండింగ్
X
అలుపెరగని బాటసారిగా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 3వేలకు పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. ప్రజల కష్టాలను దగ్గరి నుంచి చూశాడు. వారి కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చాడు. ప్రజల అభిమానం చూరగొని ఏపీ చరిత్రలోనే అద్భుత విజయం సాధించాడు. ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు, 23 మంది ఎంపీలతో చరిత్ర సృష్టించాడు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా గద్దెనెక్కి నేటికి రెండు సంవత్సరాలు అవుతోంది. ఎన్నో సమస్యలు, విపక్షాల ఆరోపణలు.. వివాదాలు, సంక్షోభాలు ఎదురైనా మొక్కవోని పట్టుదలతో చెక్కుచెదరని ఆత్మ విశ్వాసంతో ముందుకెళుతున్న సీఎం జగన్ పాలనపై ప్రత్యేక ఫోకస్..

దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019 మే 23నే వెలువడ్డాయి. . టీడీపీ కేవలం 23 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలుచుకుంది.3 ఎంపీ సీట్లు మాత్రమే గెలిచి సరిపెట్టుకుంది. టీడీపీ చరిత్రలోనే ఈరోజు ఘోరమైన ఓటమిగా చరిత్రలో నిలిచిపోయింది. వైసీపీ ఏపీలో తిరుగులేని ప్రజాదరణతో అధికారంలోకి వచ్చింది. మే 30న ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్, స్టాలిన్ వంటి సీఎంలు తోడుగా ఈ కార్యక్రమాన్ని ప్రజల సమక్షంలో నిర్వహించారు. ‘వైఎస్ జగన్ అనే నేను..’ అన్న మాటకు మొత్తం ప్రాంగణం మారుమోగిన సందర్భం అదీ. వైఎస్ విజయమ్మ కళ్లలో నీళ్లు సుడులు తిరిగిన నేపథ్యం అదీ. అలా గద్దెనెక్కిన జగన్ రెండేళ్లలో ఎన్నో పథకాలు, అభివృద్ధితో జనాలకు చేరువయ్యారు.

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది మే 30వ తేదీ. అందుకే ఆ పార్టీ నేతలు, జగన్ అభిమానులు, పార్టీ అభిమానులు ఆనందోత్సాహాలతో ఈరోజును గుర్తు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో జగన్ ఫొటోలు పెడుతూ రెండేళ్ల ప్రభంజనం అంటూ పండుగ చేసుకుంటున్నారు. ఇప్పుడు ‘జై జగన్’ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది.

వైఎస్ జగన్ తలపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రనే ఆయనకు ఇంతటి ఘన విజయాన్ని సాధించిపెట్టింది. ప్రజలకు చేరువ చేసింది. నాడు టీడీపీ-బీజేపీ ప్రభుత్వం 2014లో ఏర్పడి ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా సహా ఏపీ హామీలను బీజేపీ పెడచెవిన పెట్టింది. చంద్రబాబు అమరావతి, పోలవరం సహా ఎన్నో వాటిని పూర్తి చేయలేకపోయారు. సంక్షేమం, అభివృద్ధి సహా నిర్లక్ష్యం వహించారు. అదే టీడీపీ దారుణ ఓటమికి కారణమయ్యాయి.

జగన్ ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేసి ప్రజలకు చేరువయ్యారు. కడప జిల్లా ఇడుపులపాయలోని తండ్రి సమాధి నుంచి 2017 నవంబర్ 6న వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. ఏపీ వ్యాప్తంగా సాగి 3648 కిలోమీటర్ల భారీ పాదయాత్ర చేసి ఇచ్చాపురంలో జగన్ పాదయాత్రను విరమించారు.

2019చ ఎన్నికల్లో సర్వేలు కూడా ఊహించని రీతిలో జగన్ కు ఏపీ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు. టీడీపీని చావుదెబ్బ తీశారు. టీడీపీకి 39.18శాతం ఓట్లు రాగా.. అధికార వైసీపీకి 50శాతం ఓటు బ్యాంక్ వచ్చింది. మే23న ఫలితాలు రాగా వారానికి 2019 మే 30న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు.

ఎన్నో కష్టాలు, జైలు జీవితం.. ఉమ్మడి ఏపీలో పార్టీని కాపాడి.. ఏపీ ప్రధాన ప్రతిపక్షగా నిలబడి చివరకు 2019లో జగన్ అధికారం సాధించారు. మే 23న ఏపీ రాజకీయ చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలిచారు. అందుకే ఈరోజును వైసీపీ నేతలు గుర్తు చేసుకుంటూ పండుగ చేసుకుంటున్నారు.

*అభివృద్ధి కోణం

- అధికారం చేపట్టిన తొలి నాళ్లలోనే గ్రామ, వార్డు సచివాలయాలు స్థాపించి గ్రామస్వరాజ్యాన్ని జగన్ నెలకొల్పారు. దీనికి దేశవ్యాప్తంగా గుర్తింపు ప్రశంసలు దక్కాయి.

- వలంటీర్ల వ్యవస్థతో ఏకంగా 4.5 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. 500 రకాల సేవలను అందిస్తూ ప్రభుత్వ పాలనలో సరికొత్త విప్లవానికి నాంది పలికారు.

-పెన్షన్ మొదలు ఏ పథకమైనా గడప ముందుకొచ్చేలా పనిచేస్తున్నారు.

-రాష్ట్రంలో 11152 గ్రామ సచివాలయాలు, 3913 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిల్లో పనిచేసే లక్షలమంది ఉద్యోగులు ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో వారధులవుతున్నారు.

-అమ్మఒడి, వలంటీర్ వ్యవస్థ, గ్రామ వార్డు సచివాలయాలు, ఇంటివద్దకే రేషన్ సరుకులు, ఆరోగ్యశ్రీ, కాపునేస్తం, వైఎస్ఆర్ రైతు భరోసా, వాహనమిత్ర, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, చేయూత వంటి కార్యక్రమాలు జగన్ ను ప్రజలకు చేరువ చేశాయి.

ఇక జగన్ రెండేళ్ల పాలనపై ఒకపుస్తకాన్ని రూపొందించారు. ఆదివారం దాన్ని జగన్ ఆవిష్కరించారు. జగన్ పాలన గురించి ఈ పుస్తకంలో ప్రముఖంగా ప్రస్తావించినట్లు సమాచారం.