Begin typing your search above and press return to search.

జగన్ అఖండ విజయానికి రెండేళ్లు

By:  Tupaki Desk   |   23 May 2021 11:39 AM GMT
జగన్ అఖండ విజయానికి రెండేళ్లు
X
ఏపీలో సీఎం జగన్ చరిత్ర సృష్టించిన రోజుది. దేశ చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో.. అత్యధిక ఎమ్మెల్యే సీట్లతో ఏపీలో వైఎస్ జగన్ పార్టీ గెలిచిన రోజు. మే 23న ఏపీ ప్రజలు టీడీపీని గద్దెదించి వైసీపీకి పట్టం కట్టిన రోజు. చంద్రబాబు పాలనకు చెక్ పెట్టి వైసీపీకి 151 ఎమ్మెల్యే సీట్లు, 23 ఎంపీ సీట్లను కట్టబెట్టింది ఈరోజే.

దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019 మే 23నే వెలువడ్డాయి. వైసీపీ ఏపీలో తిరుగులేని ప్రజాదరణతో అధికారంలోకి వచ్చింది. టీడీపీ కేవలం 23 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలుచుకుంది.3 ఎంపీ సీట్లు మాత్రమే గెలిచి సరిపెట్టుకుంది. టీడీపీ చరిత్రలోనే ఈరోజు ఘోరమైన ఓటమిగా చరిత్రలో నిలిచిపోయింది.

ఏపీలో వైసీపీ ఘనవిజయం సాధించడానికి కారణమైన రోజు మే 23వ తేదీ. అందుకే ఆ పార్టీ నేతలు, జగన్ అభిమానులు, పార్టీ అభిమానులు ఆనందోత్సాహాలతో ఈరోజును గుర్తు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో జగన్ ఫొటోలు పెడుతూ రెండేళ్ల ప్రభంజనం అంటూ పండుగ చేసుకుంటున్నారు.

వైఎస్ జగన్ తలపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రనే ఆయనకు ఇంతటి ఘన విజయాన్ని సాధించిపెట్టింది. ప్రజలకు చేరువ చేసింది. నాడు టీడీపీ-బీజేపీ ప్రభుత్వం 2014లో ఏర్పడి ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా సహా ఏపీ హామీలను బీజేపీ పెడచెవిన పెట్టింది. చంద్రబాబు అమరావతి, పోలవరం సహా ఎన్నో వాటిని పూర్తి చేయలేకపోయారు. సంక్షేమం, అభివృద్ధి సహా నిర్లక్ష్యం వహించారు. అదే టీడీపీ దారుణ ఓటమికి కారణమయ్యాయి.

జగన్ ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేసి ప్రజలకు చేరువయ్యారు. కడప జిల్లా ఇడుపులపాయలోని తండ్రి సమాధి నుంచి 2017 నవంబర్ 6న వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. ఏపీ వ్యాప్తంగా సాగి 3648 కిలోమీటర్ల భారీ పాదయాత్ర చేసి ఇచ్చాపురంలో జగన్ పాదయాత్రను విరమించారు.

2019చ ఎన్నికల్లో సర్వేలు కూడా ఊహించని రీతిలో జగన్ కు ఏపీ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు. టీడీపీని చావుదెబ్బ తీశారు. టీడీపీకి 39.18శాతం ఓట్లు రాగా.. అధికార వైసీపీకి 50శాతం ఓటు బ్యాంక్ వచ్చింది. మే23న ఫలితాలు రాగా వారానికి 2019 మే 30న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు.

ఎన్నో కష్టాలు, జైలు జీవితం.. ఉమ్మడి ఏపీలో పార్టీని కాపాడి.. ఏపీ ప్రధాన ప్రతిపక్షగా నిలబడి చివరకు 2019లో జగన్ అధికారం సాధించారు. మే 23న ఏపీ రాజకీయ చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలిచారు. అందుకే ఈరోజును వైసీపీ నేతలు గుర్తు చేసుకుంటూ పండుగ చేసుకుంటున్నారు.