Begin typing your search above and press return to search.

ఇవాల్టి నుంచి ఐటీ కారిడార్ ఇలా మారిపోనుంది

By:  Tupaki Desk   |   24 Jun 2019 4:44 AM GMT
ఇవాల్టి నుంచి ఐటీ కారిడార్ ఇలా మారిపోనుంది
X
న‌గ‌రానికి ఆయువుప‌ట్టుగా మారిన ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ క‌ష్టాలు తీర్చేందుకు వీలుగా స‌రికొత్త నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. ప్ర‌యోగాత్మ‌కంగా చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మం న‌గ‌ర‌జీవులు ఎలా స్పందిస్తార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. వానొస్తే చాలు.. రోడ్ల మీద నిలిచిపోయే నీటితో ట్రాఫిక్ ఆగిపోవ‌టం.. ఆగ‌మాగం కావ‌టం చూస్తున్న‌దే. శ‌నివారం సాయంత్రం కురిసిన వ‌ర్షంతో.. ఐటీ కారిడార్ నుంచి న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల్లోకి వెళ్లిన వారంతా న‌ర‌కం అంటే ఏమిటో చూసిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ట్రాఫిక్ క‌ష్టాలు ఒక కొలిక్కి తెచ్చేందుకు వీలుగా సైబ‌రాబాద్ పోలీసులు కొత్త నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. ఐటీ కారిడార్ లోకి వెళ్లే మార్గాల్లో యూట‌ర్న్ ల‌ను దాదాపుగా క్లోజ్ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో.. న‌గ‌ర‌వాసులు తాము ప్ర‌యాణించాల్సిన దూరం కంటే నాలుగైదు కిలోమీట‌ర్లు.. ఇంకొంద‌రు అంత‌కంటే ఎక్కువ దూరాన్ని ప్ర‌యాణించాల్సి వ‌స్తుంది.

న‌గ‌రంలో నాలుగైదు కిలోమీట‌ర్లు అంటే పెద్ద విష‌యం కాకున్నా.. ట్రాఫిక్ స్లో అయిన‌ప్పుడు మాత్రం ఇది పెద్ద త‌ల‌నొప్పిగా మార‌నుంది. యుద్ధ ప్రాతిప‌దిక‌న యూట‌ర్న్ ల‌ను క్లోజ్ చేసిన సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసు వారి నిర్ణ‌యంపై న‌గ‌ర ప్ర‌జ‌లు ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఆదివారం సాయంత్రం నుంచే యూట‌ర్న్ ల‌ను క్లోజ్ చేసిన వైనం ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌య‌మైంది.

సోమ‌వారం ఉద‌యం నాటికి పూర్తిస్థాయిలో ఈ విధానం అమ‌ల్లోకి రానుంది. అయితే.. ఈ విధానాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలించ‌నున్నామ‌ని.. దీని వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉంటే ఇదే తీరును కంటిన్యూ చేస్తామ‌ని.. తేడా వ‌స్తే మాత్రం మార్పులు చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్న‌ట్లు సైబ‌రాబాద్ పోలీసులు చెబుతున్నారు. మ‌రి.. కొత్త విధానంపై న‌గ‌ర ప్ర‌జ‌ల రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.