Begin typing your search above and press return to search.

ఉబెర్ క్యాబ్ ఛార్జీలు తగ్గాయి

By:  Tupaki Desk   |   12 April 2016 7:51 AM GMT
ఉబెర్ క్యాబ్ ఛార్జీలు తగ్గాయి
X
క్యాబ్ సంస్థల మధ్య పోటీ వినియోగదారులకు బాగానే కలిసొస్తోంది. క్యాబ్ ఛార్జీలు ఆటో ఛార్జీల కంటే తగ్గిపోతుండటంతో ఖుషీ ఖుషీగా ఉన్నారు జనాలు. దేశంలో అతి పెద్ద క్యాబ్ సర్వీసులైన ఓలా.. ఉబెర్ ల మధ్య పోటీ పుణ్యమా అని ఛార్జీలు మరింత తగ్గుతున్నాయి. తమ కంటే ఓలా క్యాబ్ ఛార్జీలు తక్కువగా ఉన్న నేపథ్యంలో వినియోగదారులు దాన్నే ఎంచుకుంటుండటం.. ఓలా తమను దాటుకుని ముందుకెళ్లిపోతుండటంతో ‘ఉబెర్’ అప్రమత్తమైంది.

దేశంలోని పది నగరాల్లో ఆ సంస్థ క్యాబ్ ఛార్జీల్ని తగ్గించింది. ఈ నగరాల్లో విశాఖపట్నం కూడా ఉంది. ఈ నగరంలో కిలోమీటరుకు కేవలం ఐదు రూపాయలే ఛార్జ్ చేయబోతోంది ఉబెర్. బేస్ ఫేర్ లో మాత్రం ఏ మార్పూ లేదు. ఇండోర్- నాగ్‌పూర్ లాంటి నగరాల్లో 9 శాతం వరకు ఛార్జీలు తగ్గగా.. జోధ్‌ పూర్- ఉదయ్‌ పూఱ్ లాంటి నగరాల్లో ఏకంగా 22 శాతం వరకు ఛార్జీలు తగ్గించింది ఉబెర్. ఈ రెండు నగరాల్లో ఇంతకుముందు బేస్ ఫేర్ రూ. 40 ఉండగా, దాన్ని రూ. 25కు తగ్గించారు. అలాగే కిలోమీటరుకు ఛార్జీ కూడా రూ. 8 నుంచి రూ. 7కు తగ్గింది.

విశాఖపట్నం, నాగ్‌పూర్- ఇండోర్- అహ్మదాబాద్ నగరాల్లో కిలోమీటరుకు రూ. 5 చెల్లిస్తే సరిపోతుంది. వీటితో పాటు పుణె-అజ్మీర్-మంగళూరు-తిరువనంతపురం నగరాల్లో కూడా ఉబెర్ చార్జీలు తగ్గాయి. తమ సేవలు మరింతమందికి అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతోనే ధరలు తగ్గించినట్లు ఉబర్‌ సంస్థ తెలిపింది. త్వరలో మరిన్ని నగరాల్లో ఉబెర్ ఛార్జీలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఓలా క్యాబ్స్ ప్రస్తుతం మైక్రో క్యాబ్ పేరుతో కిలోమీటరుకు రూ. 6తో సేవలందిస్తోంది. ఈ సర్వీసులు హైదరాబాద్ సహా 13 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి.