Begin typing your search above and press return to search.

ఉదయ్‌ పూర్‌ దారుణం.. నుపుర్‌ శర్మ వ్యాఖ్యల ఫలితమేనా?

By:  Tupaki Desk   |   29 Jun 2022 12:34 AM GMT
ఉదయ్‌ పూర్‌ దారుణం.. నుపుర్‌ శర్మ వ్యాఖ్యల ఫలితమేనా?
X
బీజేపీ బహిష్కృత నేత నుపుర్‌ శర్మకు మద్దతుగా నిలిచిన ఓ యువకుడు దారుణహత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. ఇటీవల మహ్మద్‌ ప్రవక్తపై నుపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ముస్లిం దేశాలు కూడా ఆమె వ్యాఖ్యలపై భారత్‌కు నిరసన తెలిపాయి. దీంతో నష్టనివారణ చర్యలకు దిగిన బీజేపీ నుపుర్‌ శర్మను పార్టీ నుంచి బహిష్కరించింది. దేశంలోనూ పెద్ద ఎత్తున ముస్లింలు నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు నిర్వహించారు.

ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ టైలర్‌గా పనిచేస్తున్న యువకుడు నుపుర్‌ శర్మకు అనుకూలంగా తన ఫోన్లో వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టుకున్నాడని అంటున్నారు. ఇది చూసిన అవతలి వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు జూన్‌ 28న అతడి షాపులోకి ప్రవేశించి అతి దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది. తొలుత ఓ నిందితుడు పదునైన ఆయుధంతో టైలర్‌ తల నరకగా.. ఈ దుశ్చర్యను మరో నిందితుడు తన మొబైల్‌ ఫోన్‌లో వీడియో రికార్డు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. కాసేపటి తర్వాత తామే ఈ హత్య చేసినట్టు అంగీకరిస్తూ వీడియోను సామాజిక మాధ్యమాల్లో నిందితులు పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో సామాజిక మా«ధ్యమాల్లో వైరల్‌గా మారింది. సామాజిక మాధ్యమాల్లో రెండు వర్గాల మధ్య కొనసాగిన పోస్ట్‌లతోనే టైలర్‌ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. టైలర్‌ సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్‌కు సంబంధించి కొన్ని సంస్థల నుంచి బెదిరింపులు కూడా వచ్చాయని అంటున్నారు. నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.

కాగా నిందితులు ఆ వీడియోలో ప్రధాని మోదీని సైతం చంపుతామని బెదిరించారని చెబుతున్నారు. అలాగే నుపుర్‌ శర్మను కూడా అంతమొందిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని తెలుస్తోంది.

దీంతో ఉదయ్‌పూర్‌లో అల్లర్లు, ఆందోళన చెలరేగడంతో పోలీసులు జూన్‌ 28 రాత్రి నుంచి కర్ప్యూ విధించారు. 144 సెక్షన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. అదనపు పోలీసు బలగాలను దించారు. ఇంటర్నెట్‌పై నిషేధం విధించారు. ఈ దారుణ హత్యతో మార్కెట్లు, దుకాణాలు మూతపడ్డాయి. నిందితులను అరెస్టు చేయాలంటూ వ్యాపారులు నిరసనలకు దిగడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనను రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఈ దారుణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. ప్రజలంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్‌ చేయొద్దని ప్రజలను కోరారు.