Begin typing your search above and press return to search.

ఇక దృష్టంతా పాలిటిక్స్ మీదేనా ?

By:  Tupaki Desk   |   16 May 2022 1:30 AM GMT
ఇక దృష్టంతా పాలిటిక్స్ మీదేనా ?
X
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొడుకు, సినీనటుడు ఉదయనిధి స్టాలిన్ తొందరలోనే సినిమాలను వదిలేయాలని డిసైడ్ అయినట్లున్నారు. ఒకవైపు సినిమాల్లో హీరోగా నటిస్తునే మరోవైపు పార్ట్ టైమ్ గా పాలిటిక్స్ చేసేవారు. అవసరమైనపుడు పార్టీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేసేవారు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఉదయనిధి పూర్తిస్ధాయి రాజకీయనేతగా అవ్వాలని అనుకున్నట్లున్నారు. అందుకనే చెన్నైలోని చేపాక్ నియోజకవర్గం నుండి పోటీచేసి గెలిచారు.

ఎప్పుడైతే ఎంఎల్ఏగా గెలిచారో అప్పటినుండో ఉదయనిధిలో రెండో ఆలోచన మొదలైంది. అదేమిటంటే సినిమాలకు స్వస్ధిపలికి పూర్తిస్ధాయి రాజకీయనేతగా మారిపోవాలని. ఎందుకంటే తండ్రి, ముఖ్యమంత్రి స్టాలిన్ కు రాజకీయ వారసుడు ఉదయనిధి మాత్రమే. పైగా సినిమాలు అంతంతమాత్రంగానే ఉంది. గడచిన పదేళ్ళల్లో ఉదయనిధి మహా అయితే ఓ పదిసినిమాల్లో నటించుంటారంతే. అవికూడా హిట్టయినవి అంతంత మాత్రమే.

ఇప్పటికే 40 సంవత్సరాలుదాటిన ఎంఎల్ఏ కమ్ హీరో ఎంతకాలం ఉన్నా హీరోగా వెలిగేదేమీలేదు. అందుకనే ఇపుడు ఒప్పుకున్న సినిమాలు పూర్తయిన తర్వాత ఇక సినిమాలకు పూర్తిగా బైబై చెప్పేయాలని డిసైడ్ అయ్యారట. ఇదే సమయంలో పూర్తిస్ధాయి రాజకీయనేతగా తండ్రికి చేదోడువాదోడుగా ఉండబోతున్నారు. సీఎంకు కూడా వయసు 70పైనే ఉంది. అందుకనే తండ్రికి తన సాయం అవసరమని ఉదయనిధికి అర్ధమైనట్లుంది.

కాబట్టి ఉదయనిధి తొందరలోనే సినిమా రంగాన్ని వదిలేసి నూరుశాతం పాలిటిక్స్ కే కేటాయించాలని డిసైడ్ అయిపోయారు. అంటే తొందరలోనే మరో వారసుడు తమిళనాడు రాజకీయాల్లో బిజీ అయిపోబోతున్నారు. తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ఎంకే కరుణానిధి నుండి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి నిలదొక్కుకుని చెన్నై మేయర్ గా ఎంఎల్ఏ, మంత్రిగా ఓ వెలుగు వెలిగిన ఎంకే స్టాలిన్ తన వారుసుడు ఉదయనిధి స్టాలిన్ను రెడీ చేస్తున్నట్లు అర్ధమైపోతోంది. ఎలాగూ స్టాలిన్ తర్వాత ఉదయనిధే కదా తమిళనాడు ప్రభుత్వ పగ్గాలు అందుకోవాల్సింది.