Begin typing your search above and press return to search.

మహారాష్ట్రలో ముదురుతున్న వివాదం

By:  Tupaki Desk   |   14 Oct 2020 1:30 PM GMT
మహారాష్ట్రలో ముదురుతున్న వివాదం
X
మహారాష్ట్రలో గవర్నర్-ముఖ్యమంత్రి మధ్య వివాదం ముదిరిపోతోంది. చిలిచి చిలికి గాలవానలాగ మారుతున్న వివాదం చివరకు ఏకంగా గవర్నర్ ను తప్పించాలని కేంద్రానికి సిఎం లేఖ రాయాలని నిర్ణయించేదాకా చేరుకుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అసలే అంతంతమాత్రంగా ఉన్న గవర్నర్ కోషియారి, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకి మధ్య ప్రార్ధనాస్ధలాల వివాదం తాజాగా పెరిగిపోతోంది. కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలోని ప్రార్ధనా స్ధలాలన్నింటినీ ప్రభుత్వం మూసేసింది. అయితే మూసేసిన ప్రార్ధనా స్ధలాలను తిరిగి తెరవాలంటూ తనకు కొంతమంది లేఖలు రాస్తున్నట్లు కోషియారీ ప్రభుత్వానికి ఓ లేఖరాశారు.

అయితే దీనిపై సిఎం స్పందిస్తు గవర్నర్ కు వస్తున్న లేఖలన్నీ కేవలం బీజేపీ మద్దతుదారుల నుండే వస్తున్నాయంటూ ఎద్దేవా చేశారు. దాంతో ఒళ్ళుమండిపోయిన గవర్నర్ సిఎంను ఉద్దేశించి మాట్లాడుతూ ’మీరెప్పుడు సెక్యులరిస్టుగా మారిపోయా’రంటూ రిటార్టిచ్చారు. దీనికి సిఎం బదులిస్తు ’ లౌకికవాదం అన్నది రాజ్యాంగంలో భాగంకదా ? దాన్ని కాపాడుతానని మీరే కదా ప్రమాణం చేశారు. ప్రజల సెంటిమెంట్లను గౌరవించటం ఎంతముఖ్యమో వాళ్ళ ప్రాణలను కాపాడటం కూడా అంతే ముఖ్యం’. అంటు ఎత్తిపోడిచారు. అదే సందర్భంలో ’ఉన్నట్లుండి లాక్ డౌన్ విధించటం ఎంత తప్పో ఉన్నపళంగా ఎత్తేయటమూ అంతే తప్పు’ అంటూ గట్టిగానే బదులిచ్చారు.

హిందుత్వం గురించి తాము ఎవరి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు కానీ, గవర్నర్ చేసిన సూచనలను కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటామంటూ ఉద్ధవ్ చెప్పారు. మొదటినుండి గవర్నర్ కు సిఎంకు పడటం లేదు. దాంతో ఏ చిన్న అవకాశం దొరికినా ముఖ్యమంత్రిని ఇబ్బందులు పెట్టడానికి గవర్నర్ ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. దాంతో గవర్నర్ ను తప్పించే విషయాన్ని భాగస్వామ్య పార్టీలైన ఎన్సీపీ, కాంగ్రెస్ తో గట్టిగానే చర్చించాలని శివసేన ఇప్పటికే నిర్ణయించింది. భాగస్వామ్యపార్టీల మాటెలాగున్నా తామైతే గవర్నర్ ను తప్పించాలంటూ కేంద్రానికి లేఖ రాయలని డిసైడ్ అయినట్లే కనిపిస్తోంది.

ఈమధ్య గవర్నర్-సిఎంల మధ్య వివాదాలు ఇతర రాష్ట్రాల్లో కూడా పెరిగిపోతున్న విషయం అందరు చూస్తున్నదే. ఆమధ్య కర్నాటక ప్రభుత్వానికి గవర్నర్ భరద్వాజకు పడలేదు. అలాగే పశ్చిమబెంగాల్ లో ముఖ్యమంత్రి మమత బెనర్జీకి రాష్ట్ర గవర్నర్ కు పడటం లేదు. తెలంగాణాలో కూడా కేసీయార్-గవర్నర్ తమిళిసైకి మధ్య వివాదాలు మొదలైనట్లే ఉంది. పశ్చిమబెంగాల్లో లాగ మహారాష్ట్రలో ఇంకా వీళ్ళద్దరి మధ్య వివాదాలు రెడ్డుకెక్కలేదంతే.