Begin typing your search above and press return to search.
మోడీషా పరువుగోవిందా..ప్రమాదంలో ప్రజాస్వామ్యం
By: Tupaki Desk | 31 May 2018 5:41 PM GMTవచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీకి పెద్ద షాకే తగిలింది. ప్రతిపక్షాలన్నీ ఏకమైన వేళ ఉప ఎన్నికల్లో తమ పరాజయ పరంపరను కొనసాగించింది. మహారాష్ట్రలోని పాల్ ఘర్ సీటును నిలుపుకోవడం మాత్రమే బీజేపీకి కాస్త ఊరట కలిగించే విషయం. బీజేపీకి చెందిన రాజేంద్ర గవిట్ ఈ స్థానం నుంచి విజయం సాధించారు. అటు ఉత్తరాఖండ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ తరాలి అసెంబ్లీ సీటును కూడా నిలుపుకుంది. బీజేపీకి చెందిన మున్నీ దేవి షా.. కాంగ్రెస్ అభ్యర్థి జీత్‌రామ్‌పై 1900 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
అయితే , మహారాష్ట్రలోని పాల్‌ఘర్ లోక్ సభ ఉపఎన్నికల ఫలితాలపై శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.. ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘానికే నియంత్రణ లేదని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర గవిట్ గెలుపొందడంపై శివసేన కార్యాలయంలో ఉద్దవ్ ఠాక్రే మీడియా ద్వారా మాట్లాడుతూ.. పాల్ ఘర్ ఉపఎన్నిక ఫలితాలను ప్రకటించవద్దని ఈసీని కోరారు. ఓట్ల లెక్కింపులో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయన్నారు. ఓట్లు మళ్లీ లెక్కించాలని డిమాండ్ ఉద్దవ్ ఠాక్రే చేశారు. అవసరమైతే ఈసీపై కోర్టుకు వెళ్తామన్నారు. పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని విజ్ఞప్తి చేశారు. పార్టీలన్నీ ఈసీకి వ్యతిరేకంగా కోర్టులో ఫిర్యాదు చేయాలన్నారు. కాగా పాల్‌ఘర్ స్థానం నుంచి గెలుపొందిన బీజేపీ అభ్యర్థి రాజేంద్ర గవిట్ కు జిల్లా కలెక్టర్ సర్టిఫికెట్ ను అందజేశారు.
సొంత రాష్ట్రంలో ఓడి మహారాష్ట్రలో ప్రచారానికా అని ఉద్దవ్ ఠాక్రే ఎద్దేవా చేశారు. యోగి ఆదిత్యానాథ్ సొంత రాష్ట్రంలోనే ఓడిపోయారని ఉద్దవ్ ఠాక్రే అన్నారు. సొంత రాష్ట్రంలో ఓడిన యోగి మహారాష్ట్రలో ప్రచారానికి వచ్చారని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో యోగి ప్రచారం వల్ల ఒరిగిందేమీ లేదన్నారు. పోలింగ్‌కు ఒకరోజు ముందు బీజేపీ భారీగా డబ్బు పంపిణీ చేసిందని ఆరోపించారు.