Begin typing your search above and press return to search.

మోదీని శరణువేడిన ఉద్ధవ్..పదవీ గండం తప్పేనా?

By:  Tupaki Desk   |   29 April 2020 5:31 PM GMT
మోదీని శరణువేడిన ఉద్ధవ్..పదవీ గండం తప్పేనా?
X
ఓ వైపు ప్రాణాంతక వైరస్ విలయతాండవం చేస్తోంటే.. మరోవైపు చట్ట సభ సభ్యత్వం దక్కని వైనం మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఠారెత్తిస్తున్నదే చెప్పాలి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మిశ్రమ ఫలితాల నేపథ్యంలో ఊహించని పరిస్థితుల్లో ఉద్దవ్ కు ‘మహా’ సీఎం పీఠం దక్కేసింది. సీఎం పీఠం దక్కడమే గానీ... ఇప్పటిదాకా ఆయనకు అటు అసెంబ్లీలో గానీ, ఇటు శాసనమండలిలో గానీ సభ్యత్వమే దక్కలేదు. చూస్తుండగానే... నిర్దేశిత ఆరు నెలల కాలం కూడా ముగిసిపోతోంది. ఈ గడువు దగ్గర పడుతున్న కొద్దీ ఉద్ధవ్ లో టెన్షన్ పెరుగుతోంది. శివసేన శ్రేణులైతే... ఏకంగా హాహాకారాలు చేస్తున్న పరిస్థితి. తమ పెద్ద పులికి పదవీ గండం తప్పదా అంటూ సేన శ్రేణులు నిజంగానే తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు. ఇలాంటి తరుణంలో ఇప్పటిదాకా చేసిన యత్నాలన్నీ ఫలించకపోగా... చివరి అస్త్రంగా ఉద్ధవ్... ప్రధాని నరేంద్ర మోదీని శరణువేడినంత పని చేశారు.

బుధవారం ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర సీఎం హోదాలో నేరుగా మోదీకే ఫోన్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో పాటుగా తనకు పొంచి ఉన్న పదవీ గండాన్ని కూడా ఆయన మోదీ చెవిలో వేశారు. తనను రక్షించాలంటూ దాదాపుగా వేడుకున్నంత పనిచేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో తనకు పొంచి ఉన్న పదవీ గండాన్ని తప్పించకపోతే... రాష్ట్రంలో అస్థిర పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని కూడా ఆయన మోదీకి చెప్పేశారు. తనను, తన రాష్ట్రాన్ని గట్టున పడేసే వారు మీరేనంటూ మోదీని ఉద్ధవ్ శరణువేడారట. మరి ఉద్ధవ్ కు మోదీ ఎలాంటి సమాధానం ఇచ్చారో తెలియదు గానీ... ఇప్పుడు మోదీ సానుకూలంగా స్పందిస్తేనే ఉద్ధవ్ గండం నుంచి గట్టెక్కుతారు. లేదంటే... సీఎం పదవి నుంచి ఉద్ధవ్ దిగిపోక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పక తప్పదు.

అటు అసెంబ్లీ, ఇటు మండలిలో సభ్యత్వం లేకుండానే.. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి కూటమి కట్టిన ఉద్ధవ్ మహారాష్ట్ర సీఎం పీఠం ఎక్కేశారు. సీఎం పీఠం ఎక్కిన తర్వాత ఆరు నెలల్లో ఏదో ఒక సభలో సభ్యత్వం లేకపోతే.. సీఎం కుర్చీ నుంచి దిగిపోక తప్పని పరిస్థితి. కరోనా కారణంగా లాక్ డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో శాసనమండలి ఎన్నికలను నిర్వహించే పరిస్థితి లేదు. అలాగని గవర్నర్ కోటాలో మండలికి ఎన్నికవుదామంటే... గవర్నర్ సీట్లో బీజేపీకి చెందిన భగత్ సింగ్ కోష్యారీ ఉన్నారాయే. సంకీర్ణ సర్కారులో ఆది నుంచి తమతో పాటే నడిచిన సేన.. ఈ దఫా బీజేపీకి దూరంగా జరిగి కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుని మరీ సీఎం కుర్చీని దక్కించుకుంది. దీంతో సేనకు సాయం చేసే ఉద్దేశ్యమే లేనట్లు కోష్యారీ కనిపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఉద్ధవ్.. మోదీని శరణువేడారు. మరి ఉద్ధవ్ కు పదవీ గండాన్ని మోదీ తప్పిస్తారో, లేదంటే తనతో స్నేహాన్ని వీడినందుకు బలి చేస్తారో చూడాలి.