Begin typing your search above and press return to search.

అమిత్ షాకు గ‌ట్టి దెబ్బే త‌గిలింది!

By:  Tupaki Desk   |   19 Jun 2017 4:36 AM GMT
అమిత్ షాకు గ‌ట్టి దెబ్బే త‌గిలింది!
X
గ‌డ‌చిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రాలుగా వినుతికెక్కిన న‌రేంద్ర మోదీ, అమిత్ షాలు ఇప్పుడు కీల‌క ప‌ద‌వుల్లో ఉన్నారు. న‌రేంద్ర మోదీ దేశ ప్ర‌ధాన మంత్రి పీఠాన్ని అధిష్టించ‌గా, అమిత్ షా మాత్రం కేంద్రంలో అధికారం చేజిక్కించుకున్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి జాతీయ అధ్య‌క్షుడిగా కీల‌క భాద్య‌త‌ల్లో ఒదిగిపోయారు. ప్ర‌స్తుతం వీరు ఇద్ద‌రిని కాద‌ని దేశంలో ఏ ఒక్క కీల‌క నిర్ణ‌యం కూడా పాస్ కాని ప‌రిస్థితి ఉందంటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదేమో. ఎందుకంటే మొన్న‌టికి మొన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌తిపాదించిన పెద్ద నోట్ల ర‌ద్దు... ఎంత‌మంది కాద‌న్నా, విప‌క్షాల‌తో పాటు మిత్ర‌ప‌క్షాలు కూడా అరిచి గీపెట్టినా కూడా ఆ నిర్ణ‌యం అమ‌లైపోయింది. నెల‌ల త‌ర‌బ‌డి జ‌నం బెంబేలెత్తిపోయినా కూడా కేంద్రం ఒక్క మెట్టు కూడా వెన‌క్కు త‌గ్గ‌లేదు.

ఇక తాజాగా మెజారిటీ రాష్ట్రాలు - వ్యాపార వ‌ర్గాలు వ‌ద్దు మొర్రో అంటున్న జీఎస్టీని అమ‌లు చేసి తీరతామంటూ మోదీ కేబినెట్ స‌హ‌చ‌రుడు అరుణ్ జైట్లీ తెగేసి చెబుతున్నారు. అంటే ఎవ‌రికి ఇష్టం లేక‌పోయినా.. వ‌చ్చే నెల 1 నుంచి జీఎస్టీ ప‌న్ను అమ‌ల్లోకి వ‌చ్చేస్తుంద‌న్న మాట‌. మొన్న‌టిదాకా జీఎస్టీ వ‌ద్దంటూ చాలా రాష్ట్రాలు నిర‌స‌న వ్య‌క్తం చేసినా... బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా రంగంలోకి దిగిన అమిత్ షా ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న త‌మ మిత్ర‌ప‌క్షాల‌కు చెందిన ప్ర‌భుత్వాల‌ను ఒప్పించార‌న్న మాట జ‌గ‌మెరిగిన స‌త్య‌మే.

ఈ క్ర‌మంలో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక విష‌యంలోనూ తాము అనుకున్న‌ట్లుగానే ముందుకు సాగుదామంటూ మోదీషా ద్వ‌యం నిర్ణ‌యం తీసుకున్న‌ట్టుంది. వ‌చ్చే నెల‌లో ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ను ఖాళీ చేయ‌గానే... ఆయ‌న స్థానంలో కొత్త వ్య‌క్తిని ఎన్నుకోవాల్సి ఉంది. ఇప్ప‌టికే రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ నోటిఫికేష‌న్ కూడా విడుద‌ల చేసింది. అయితే మోదీషా ద్వ‌యం ర‌చించుకున్న ప్ర‌ణాళిక ప్ర‌కారం అధికార పార్టీ అభ్య‌ర్థి ప్ర‌క‌ట‌న ఇప్ప‌టిదాకా తేల‌నే లేదు. ఎందుకంటే... తాము అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌క‌ముందే అన్ని పార్టీలు త‌మ దారికి రావాల‌న్న కాంక్ష‌తో వారిద్ద‌రూ ఉన్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఈ క్ర‌మంలో మొన్న మోదీ ఆదేశాల‌తో రంగంలోకి దిగిన కేంద్ర మంత్రులు రాజ్‌ నాథ్ సింగ్‌ - వెంక‌య్య‌నాయుడుల‌కు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ - సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరీ భారీ ఝ‌ల‌క్కిచ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా అలాంటి ఝ‌ల‌క్కే... అమిత్ షాకు కూడా త‌గిలింది. రాజ్‌ నాథ్ - వెంక‌య్య‌ల‌కు విప‌క్షాల నుంచి దెబ్బ త‌గ‌ల‌గా - అమిత్ షాకు మాత్రం త‌మ మిత్ర‌ప‌క్షం నుంచే ఈ దెబ్బ త‌గ‌ల‌డం విశేషం. ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే... రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు సంబంధించి తాము ప్ర‌తిపాదించే వ్య‌క్తికి మ‌ద్ద‌తివ్వాల్సిందేన‌ని అమిత్ షా... శివ‌సేన చీఫ్ ఉద్ధ‌వ్ ఠాక్రేను కోరారు. ఈ మేర‌కు షానే స్వ‌యంగా ఉద్ధ‌వ్ ఇంటికి వెళ్లి మ‌రీ ఈ ప్ర‌తిపాద‌న ఆయ‌న ముందు పెట్టార‌ట‌. అయితే అమిత్ షా వైపు కాస్తంత అనుమానంగా చూసిన ఉద్ధ‌వ్‌... బీజేపీ ప్ర‌తిపాద‌న‌కు స‌సేమిరా అన్నార‌ట‌.

ముందుగా అభ్య‌ర్థి ఎవ‌రో చెబితే... మ‌ద్ద‌తిచ్చేది? లేనిది? ఆలోచించి చెబుతాన‌ని ఆయ‌న అమిత్ షా ముఖం మీదే చెప్పేశార‌ట‌. అంతేకాకుండా అభ్య‌ర్థి ఎవ‌రో చెప్ప‌కుండా మ‌ద్ద‌తివ్వ‌మన‌డం ఎంత‌వ‌ర‌కు క‌రెక్ట్ అంటూ ఉద్ధ‌వ్ వేసిన ప్ర‌శ్న‌కు అమిత్ షా నోట మాట కూడా రాలేద‌ట‌. మిత్ర‌ప‌క్షాలపై న‌మ్మ‌కముంచి ముందుగా అభ్య‌ర్థిని ఖ‌రారు చేయాల‌ని, అలా కాకుండా ముందుగా మ‌ద్ద‌తు ఇవ్వ‌మ‌ని కోర‌డం స‌భ్య‌త కాద‌ని కూడా ఉద్ధ‌వ్ అన్నార‌ని స‌మాచారం. అభ్య‌ర్థి పేరు చెప్ప‌కుండా మ‌ద్ద‌తు కోసం మిత్ర‌ప‌క్షాల‌పై ఒత్తిడి తీసుకొస్తే స‌హించేది లేద‌ని కూడా ఆయ‌న షాకు చెప్పార‌ట‌. దీంతో త‌న ప‌థ‌కం పార‌క‌పోగా... ఉద్ధ‌వ్ సంధించిన ప్ర‌శ్న‌ల‌కు లోలోప‌లే మ‌ద‌న‌పడుతూ షా అక్క‌డి నుంచి వెళ్లిపోయార‌ట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/