Begin typing your search above and press return to search.

ఉద్ధ‌వా...మ‌ద్ధ‌తిచ్చాక ఈ ముచ్చ‌ట్లెందుకూ?

By:  Tupaki Desk   |   22 Jun 2017 5:58 AM GMT
ఉద్ధ‌వా...మ‌ద్ధ‌తిచ్చాక ఈ ముచ్చ‌ట్లెందుకూ?
X
భార‌త త‌దుప‌రి రాష్ట్ర‌ప‌తి ఎన్నిక కోసం ఎన్డీఏ స‌ర్కారుకు నేతృత్వం వ‌హిస్తున్న బీజేపీ... త‌న అభ్య‌ర్థిగా సీనియర్ నేత‌ - మొన్న‌టిదాకా బీహార్ గ‌వ‌ర్న‌ర్‌ గా ప‌నిచేసిన రామ్‌నాథ్ కోవింద్‌ ను ఎంపిక చేసి మిత్ర‌ప‌క్షాల‌న్నింటికీ భారీ షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే. కోవింద్‌ ను రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా బీజేపీ ఎంపిక చేస్తుంద‌ని ఏ ఒక్క‌రు కూడా ఊహించ‌లేదు కూడా. బీజేపీలోకి కొంత మంది నేత‌ల‌కు కూడా చివ‌రి నిమిషం దాకా ఈ విష‌యంపై అంత‌గా స్ప‌ష్ట‌త లేద‌నే చెప్పాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న‌ది ఎన్డీఏ కాబ‌ట్టి, ఆ కూట‌మికి నేతృత్వం వ‌హిస్తున్న బీజేపీ... త‌న నిర్ణ‌యాన్ని ఇత‌ర మిత్ర‌ప‌క్షాల‌కు చెప్పిన త‌ర్వాత గానీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించాలి.

అయితే ఈ దిశ‌గా ముందుకెళ్లేందుకు ఇష్ట‌ప‌డ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ - బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాలు... అందరినీ షాక్‌ కు గురి చేస్తూ కోవింద్‌ ను ఎన్డీఏ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించేశారు. కోవింద్ అభ్య‌ర్థిత్వం ప‌ట్ల ఎన్డీఏలోని ఏ ఒక్క మిత్ర‌ప‌క్షానికి కూడా వ్య‌తిరేక‌త ఏమీ లేదు. అయితే త‌మ‌కు ఓ మాట ముందుగా చెబితే బాగుంటుంది క‌దా అని ప‌లు పార్టీలు లోలోప‌లే ఆవేద‌న‌ను దిగ‌మింగుకున్నాయి. అయితే ఈ త‌ర‌హా వైఖ‌రికి పూర్తి భిన్నంగా ఉండే ఎన్డీఏలోని భాగ‌స్వామ్య ప‌క్షం శివ‌సేన మాత్రం త‌న నోటికి తాళం వేయ‌లేక‌పోయింది. శివ‌సేన అధినేత ఉద్ధ‌వ్ ఠాక్రే... కోవింద్ అభ్యర్థిత్వంపై సానుకూలంగానే స్పందిస్తూ కాస్తంత ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

దళిత సామాజిక వ‌ర్గానికి చెందిన కోవింద్ ను రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ఎంపిక చేయ‌డం ద్వారా బీజేపీ ద‌ళిత ఓటు బ్యాంకుపై క‌న్నేసిందని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. త‌మ‌కు కూడా కోవింద్ అభ్య‌ర్థిత్వం ప‌ట్ల అంత‌గా వ్య‌తిరేక‌త ఏమీ లేద‌ని చెప్పిన ఉద్ధ‌వ్‌... ఎన్డీఏలో కీల‌క భాగ‌స్వామి అయిన బీజేపీ... ఈ నిర్ణ‌యం తీసుకునే ముందు మిగిలిన భాగ‌స్వామ్య ప‌క్షాల అభిప్రాయాల‌ను కూడా తెలుసుకోవాలి క‌దా అని వ్యాఖ్యానించారు. త‌మ‌కు మాట మాత్రంగా చెప్ప‌కుండానే కోవింద్ ను రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎంపిక చేశార‌ని, దీనిపై పార్టీలో చ‌ర్చించిన త‌ర్వాతే త‌మ అభిప్రాయం చెబుతామ‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు.

అన్ని స‌మ‌యాలు మ‌న‌కు అనుకూలంగా ఉండ‌వ‌న్న విష‌యాన్ని బీజేపీ నేత‌లు గుర్తెరిగితే మంచిద‌ని వ్యాఖ్యానించిన ఉద్ధ‌వ్‌... మ‌హారాష్ట్ర‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల మాట‌ను ఏం చేశారంటూ బీజేపీ నేత‌ల‌ను నిల‌దీశారు. అయినా... మోదీషాలు ఎంపిక చేసిన కోవింద్ అభ్య‌ర్థిత్వంపై త‌మ‌కేమీ వ్య‌తిరేక‌త లేద‌ని చెప్పిన త‌ర్వాత కూడా ఉద్ధ‌వ్ ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేయ‌డం మాత్రం కాస్తంత విడ్డూరంగానే ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/