Begin typing your search above and press return to search.

మమతకు షాక్ : 15న భేటీకి హ్యాండిచ్చిన ఉద్దవ్ థాక్రే

By:  Tupaki Desk   |   12 Jun 2022 11:00 AM GMT
మమతకు షాక్ : 15న భేటీకి హ్యాండిచ్చిన ఉద్దవ్ థాక్రే
X
చాన్నాళ్ళ తరువాత బెంగాల్ వీరనారి మమతా బెనర్జీ గర్జించారు. అది కూడా మంచి టైమ్ టైమింగ్ చూసి మరీ జాతీయ స్థాయిలో పొలిటికల్ గా పావులు కదుపుతున్నరు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధికి దెబ్బ కొట్టాలని, విపక్షాల అభ్యర్ధికి విజయం చేకూర్చడం ద్వారా తక్షణ రాజకీయ లాభంతో పాటు 2024లో జరిగే ఎన్నికల అనంతర పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని భారీ స్కెచ్ గీశారు.

అందుకోసం ఆమె ఈ నెల 15న ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో అత్యంత కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి దేశంలోని బీజేపీయేతర ముఖ్యమంత్రులు, కీలకమైన జాతీయ నాయకులను ఆహ్వానించారు. మమత లేఖలు రాసిన వారిలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు కూడా ఈ ఆహ్వానం అందింది.

కానీ తాము ఆ రోజున హాజరుకాబోవడంలేదని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ మీడియాకు చెప్పడం విశేషం. ఆ రోజున ఉద్ధవ్ థాక్రే అయోధ్యలో ఉంటారని ఆయన వెల్లడించారు. తమది ముందుగా ఖరారు అయిన ప్రోగ్రాం అంటున్నారు. తమ పార్టీ తరఫున ఒక నాయకుడిని మాత్రం పంపుతామని చెబుతున్నారు. ఒక విధంగా మమతా దీదీకి ఇది గట్టి షాక్ గానే చూస్తున్నారు.

ఆమె విపక్షాలను ఒక త్రాటిమీదకు కూడగట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక మహారాష్ట్రలో కీలకమైన పక్షంగా ఉన్న శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ ఇతర పక్షాల సాయంతో అధికారంలో ఉంది. మరి అలాంటి కీలకమైన పార్టీ మమత మీటింగునకు డుమ్మా కొట్టడం అంటే ఆలోచించాల్సిందే.

ఇది ఆరంభం అని మరిన్ని పార్టీలకు చెందిన నాయకులు కూడా ఈ భేటీకి రాకపోవచ్చు అని అంటున్నారు. మమత భేటీకి వెళ్తే ఆమె నాయకత్వాన్ని అంగీకరించినట్లే అని కొంతమంది ఆలోచిస్తున్నారుట. ఇక బీజేపీకి కంఫర్టబుల్ మెజారిటీ ఉన్న వేళ ఇలాంటి ప్రయత్నాలు చేసి ఎందుకు చెడ్డ కావాలని మరికొందరు ముందు చూపుతో ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా మమత మీటింగునకు ఎంతమంది వస్తారు అన్న దాని మీదనే ఆమె నాయకత్వ దక్ష‌త. ఆమె పట్ల విపక్ష పార్టీలకు ఉన్న అభిప్రాయం తేటతెల్లమవుతాయని చెప్పాలి.