Begin typing your search above and press return to search.

ఠాక్రేకు అదే క‌ష్టం అవుతోందా!

By:  Tupaki Desk   |   10 Dec 2019 8:29 AM GMT
ఠాక్రేకు  అదే క‌ష్టం అవుతోందా!
X
మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉద్ధ‌వ్ ఠాక్రే ప్ర‌మాణ స్వీకారం చేసి ప‌క్షం రోజులు గ‌డిచిపోయాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ అక్క‌డ కేబినెట్ ఏర్ప‌డ‌లేదు. ఠాక్రే ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ప్పుడే ఆయ‌న‌తో పాటు అర‌డ‌జ‌ను మంది మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం అయితే చేశారు. కానీ వారికి శాఖ‌ల కేటాయింపు జ‌ర‌గ‌లేదు!

కొత్త‌గా మంత్రుల నియామ‌క‌మూ చేయ‌లేక‌పోతూ ఉన్నారు. ఉన్న వారికి శాఖ‌ల కేలాయింపూ చేయ‌లేక‌పోతూ ఉన్నారు. ఇది ముఖ్య‌మంత్రిగా ఉద్ధ‌వ్ ఠాక్రే పరిస్థితి.

శివ‌సైనికుడే మ‌హారాష్ట్ర సీఎంగా ఉండాల‌న్న పంతం అయితే నెగ్గింది కానీ, దూకుడుగా ముందుకు వెళ్ల‌డానికి అవ‌కాశం లేకుండా పోతోంది. దానికి కార‌ణం ఏమిటో చెప్ప‌న‌క్క‌ర్లేదు.

ఏర్ప‌డిన‌ది కూట‌మి ప్ర‌భుత్వం. ఏ ప‌ని చేయాల‌న్నా కూట‌మిలోని మూడు పార్టీల మ‌ద్ద‌తూ ఉండాలి. కేబినెట్ విష‌యంలో అయితే ఎవరి డిమాండ్లు వారికి ఉండ‌నే ఉన్నాయి.

కీల‌క‌మైన శాఖ‌ల విష‌యంలో మూడు పార్టీలూ డిమాండ్లు చేస్తూ ఉన్నాయి. హోం మంత్రి - ఆర్థిక మంత్రి - రెవెన్యూ శాఖ‌.. ఈ మూడు ప‌ద‌వుల విష‌యంలో మూడు పార్ట‌లూ పోటీ ప‌డుతూ ఉన్నాయి. కీల‌క‌మైన ఈ మూడు ప‌ద‌వుల‌నూ ఒక్కో పార్టీ ఒక్కోటి తీసుకోవాల‌ని తాప‌త్ర‌యప‌డుతూ ఉన్నాయి.

సీఎం ప‌ద‌వి విష‌యంలో కాంగ్రెస్ త్యాగం చేసింది. ఎన్సీపీ డిప్యూటీ సీఎం కథా ఇంకా తేల లేదు. ఈ నేప‌థ్యంలో శాఖ‌ల విష‌యంలో ఆ పార్టీలు గ‌ట్టిగా బెట్టు చేసే అవ‌కాశాలు క‌నిపిస్తూ ఉన్నాయి. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్పుడే ఎవ‌రికి ఎన్ని మంత్రి ప‌ద‌వులు అనే అంశంపై ఈ పార్టీలు ఒప్పందానికి వ‌చ్చాయి. అయితే శాఖ‌ల విష‌యంలో మాత్రం ఏకాభిప్రాయం ఇంకా కుదిరిన‌ట్టుగా లేదు. చ‌ర్చ‌లు సాగుతూ ఉన్నాయ‌ట‌. దీంతో కేబినెట్ ఏర్పాటు వాయిదా ప‌డుతూ ఉంది.