Begin typing your search above and press return to search.

ఐటీ గ్రిడ్స్ ఎపిసోడ్లో ఆధారాల్లేవ‌న్న ఆధార్

By:  Tupaki Desk   |   18 April 2019 5:46 AM GMT
ఐటీ గ్రిడ్స్ ఎపిసోడ్లో ఆధారాల్లేవ‌న్న ఆధార్
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ఐటీ గ్రిడ్స్ డేటా చౌర్యం కేసుకు సంబంధించి భార‌త విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ సింఫుల్ గా చెప్పాలంటే యూఐడీఏఐ.. ఇంకా సింఫుల్ గా చెప్పాలంటే ఆధార్ సంస్థ‌.. తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేసింది.

తెలుగు రాష్ట్రాల్లోని 7.82 కోట్ల మంది ఆధార్ కార్డుదారుల వివ‌రాల్ని ఐటీ గ్రిడ్స్ సంస్థ సేక‌రించింద‌న్న ఆరోప‌ణ‌ల్లో నిజం లేదంది. త‌మ స‌ర్వ‌ర్ల‌లోకి అక్ర‌మంగా జొర‌బ‌డి స‌మాచారాన్ని సేక‌రించిన దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవ‌ని పేర్కొంది. త‌మ స‌ర్వ‌ర్లు సుర‌క్షితంగా ఉన్నాయ‌ని వివ‌రించింది.

సెంట్ర‌ల్ ఐడెంటిటీస్ డేటా రిపాజిట‌రీ స‌ర్వ‌ర్లు పూర్తి సేఫ్ గా ఉన్నాయ‌ని.. వాటిల్లోకి ఎవ‌రూ అక్ర‌మంగా అనుసంధానం కాలేర‌ని. స‌ర్వ‌ర్ల నుంచి ఎలాంటి డేటా చోరీకి గురి కాలేద‌ని పేర్కొంది. ఐటీ గ్రిడ్స్ డేటా చౌర్యంపై నియ‌మించిన సిట్ ఇందుకు సంబంధించిన ఆధారాలు ఏమీ సేక‌రించ‌లేక‌పోయింద‌ని చెప్పింది.

సున్నిత‌మైన ఆధార్ స‌మాచారాన్ని కొన్ని అవ‌స‌రాల కోస‌మే స‌ర్వీసు ప్రొవైడ‌ర్లు ఉప‌యోగించాల‌ని.. వినియోగ‌దారుల అనుమ‌తి లేకుండా ఇత‌రుల‌తో ఆ వివ‌రాలు పంచుకోడ‌ద‌ని చెప్పింది. చ‌ట్టాన్ని ఉల్లంఘించి ఆధార్ సంఖ్య‌ల్ని సేక‌రించ‌టం.. వాటిని నిల్వ చేసుకోవ‌టం.. వినియోగించటం.. ఇత‌రుల‌తో పంచుకోవ‌టం లాంటివి చేస్తే ప్రాసిక్యూష‌న్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని పేర్కొంది.

ఐటీ గ్రిడ్స్ సంస్థ ప్ర‌జ‌ల నుంచి ఆధార్ సంఖ్య‌ల్ని సేక‌రించి.. నిల్వ చేయ‌టానికి ఉన్న కార‌ణాల‌పై ద‌ర్యాప్తు చేయాల‌ని త‌మ‌ను కోరాన‌ని.. ఈ ఘ‌ట‌న‌లో డేటా కానీ స‌ర్వ‌ర్లకు కానీ ఎలాంటి సంబంధం లేద‌ని పేర్కొంది. ఒక వ్య‌క్తి ఆధార్ సంఖ్య బ‌య‌ట‌కు తెలీటం వ‌ల్ల అత‌డికి ఎలాంటి ముప్పు వాటిల్ల‌ద‌ని.. ఎందుకంటే.. ఇందులో బ‌యోమెట్రిక్.. వ‌న్ టైం పాస్ వ‌ర్డ్ లాంటివి ఉంటాయ‌ని గుర్తు చేసింది. సో.. ఐటీ గ్రిడ్ ఎపిసోడ్ మొత్తం తుస్ మ‌న్న‌ట్లేనా?