Begin typing your search above and press return to search.

మాల్యా అప్ప‌గింత‌కు కోర్టు ఓకే..నెక్ట్స్ జ‌రిగేది ఇదే

By:  Tupaki Desk   |   10 Dec 2018 12:55 PM GMT
మాల్యా అప్ప‌గింత‌కు కోర్టు ఓకే..నెక్ట్స్ జ‌రిగేది ఇదే
X
బ్యాంకుల‌కు వేల కోట్లు ఎగ‌వేసిన విజ‌య్ మాల్యాను భార‌త్‌ కు అప్ప‌గించాల‌ని ఇవాళ లండ‌న్ కోర్టు తీర్పునిచ్చింది. భార‌తీయ స్టేట్ బ్యాంక్‌ తో సంబంధం ఉన్న బ్యాంకుల‌కు మాల్యా సుమారు 9 వేల కోట్లు ఎగొట్టారు. వెస్ట్‌ మినిస్ట‌ర్ కోర్టు ఈ కేసులో ఇవాళ కీల‌క తీర్పును వెలువ‌రించింది. మాల్యా కేసు విదేశాంగ శాఖ చూసుకుంటుంద‌ని కోర్టు వెల్ల‌డించింది. అయితే బ్యాంకుల‌కు చెల్లించాల్సిన సొమ్మును ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్న‌ట్లు మాల్యా వెల్ల‌డించారు. అదే విష‌యాన్ని ఇవాళ కోర్టుకు వెళ్లేముందు కూడా మాల్యా స్ప‌ష్టం చేశారు. దీన్ని సీబీఐ స్వాగ‌తించింది.

బ్యాంకుల దగ్గర రూ.9 వేల కోట్లు రుణంగా తీసుకున్న మాల్యా.. వాటిని చెల్లించకుండా లండన్ పారిపోయిన సంగతి తెలిసిందే. అతన్ని తిరిగి భారత్‌ కు అప్పగించాలని సీబీఐ లండన్ కోర్టులో పిటిషన్ వేసింది. ప్రస్తుతం దానిపైనే విచారణ జరుగుతోంది. వెస్ట్‌ మినిస్టర్ కోర్టు కీల‌క‌ తీర్పు చెప్పనున్న నేపథ్యంలో సోమవారం మాల్యా కోర్టుకు వచ్చాడు. అక్కడున్న మీడియాతో మాట్లాడుతూ.. తాను బ్యాంకుల దగ్గర తీసుకున్న రుణాలు - ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలన్నింటినీ తిరిగి చెల్లిస్తానని స్పష్టం చేశాడు. ఈ అప్పగింత కేసు నడుస్తున్న కారణంగా తాను రుణాలు చెల్లిస్తానని చెప్పడం లేదని - ఈ కేసుతో దీనికి సంబంధం లేదని అతను చెప్పాడు. ఈ సెటిల్ మెంట్ ఆఫర్‌ను తాను కోర్టులోనే చేశానని - అందువల్ల ఆ విషయంలో వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని మాల్యా అన్నాడు.

విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించాలా వద్దా అన్నదాని కేసులో విచారణ జరగనున్న సందర్భంగా సీబీఐ జాయింట్ డైరెక్టర్ సాయి మనోహర్ ఆదివారమే లండన్‌కు వెళ్లారు. వెస్ట్‌ మినిస్ట‌ర్ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ స్వాగ‌తించింది. ఇక త్వ‌ర‌లోనే మాల్యాను భార‌త్‌ కు తీసుకువ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. ఆయ‌న కోసం ముంబైలో ప్ర‌త్యేక జైలును కూడా త‌యారు చేశారు. కోర్టు తీర్పుపై అపీల్ చేసుకునేందుకు మాల్యాకు 14 రోజుల స‌మ‌యాన్నిచ్చారు.