Begin typing your search above and press return to search.

నేతాజీ మిస్టరీ 9వ తేదీన వీడనుందా?

By:  Tupaki Desk   |   3 Jan 2016 7:41 AM GMT
నేతాజీ మిస్టరీ 9వ తేదీన వీడనుందా?
X
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం ఇప్పటికీ మిస్టరీయే. ఆయన మరణంపై ఎన్నో కథనాలు. విమాన ప్రమాదంలో మరణించలేదు.. ఎంతో కాలం జీవించారనే వారు కొందరు.. లేదు చనిపోయారనే వారు కొందరు. ప్రభుత్వాల వద్ద ఆ రహస్యానికి సంబంధించిన వివరాలున్నా కూడా బయటపెట్టకపోవడం... అందుకు కారణాలేంటనేవి ప్రజలకు అర్థమయ్యీ కానట్లుగా ఉండడంతో ఇది దేశమంతటా నిత్యం ఆసక్తికలిగించే అంశంగా మారిపోయింది. సుదీర్ఘకాలంగా ఉన్న ఈ చిక్కుముడి వారం రోజుల్లో వీడిపోనుందా...? 9వ తేదీన బోస్ కు సంబంధించిన కీలక పత్రాలు వెల్లడి చేస్తామని బ్రిటన్ కు చెందిన ఓ వెబ్ సైట్ ప్రకటించడంతో అందరిలో ఆసక్తి రేగుతోంది.

నేతాజీ 1945 ఆగస్టు 18నే మరణించారా? ఆయన 1952లో చైనాలో కనిపించారని, 1964లో నెహ్రూ అంత్యక్రియల్లో పాల్గొన్నారన్న ప్రచారం ఒట్టిదేనా? వంటి ఎన్నో ప్రశ్నలకు WWW.BOSEFILES.INFO అనే వెబ్ సైట్ కొంత సమాధానాలు చెబుతోంది. నేతాజీ మునిమనవడు పెట్టిన ఈ వెబ్ సైట్లో ఆయన సేకరించిన కొన్ని పత్రాలను ఉంచారు. ఆయన పొందుపరిచిన పత్రాలు ఎన్నో కొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి. బోస్ చనిపోయారని చెప్తున్న విమాన ప్రమాదం తర్వాత కొన్నేళ్లకు ఆయన చైనాలో కనిపించారన్న వాదనలు ఉన్నాయి. కానీ ఈవెబ్ సైట్ విడుదల చేసిన పత్రాల్లో అలాంటి ఆధారాలేమీ లేవు.

బోస్ 1945లో తైవాన్‌ లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారని ప్రభుత్వాలు చెబుతుంటాయి.. కానీ, అయితే 1952లో ఎస్‌ఎం గోస్వామి అనే బోసు అభిమాని నేతాజీ మిస్టరీ వీడింది అనే శీర్షికతో ఒక కరపత్రం వెలువరించారు. అందులో మంగోలియన్ వాణిజ్య ప్రతినిధి బృందం చైనా అధికారులతో ఉన్న ఒక ఫొటోను ముద్రించారు. అందులో ఉన్న ఒక వ్యక్తి సుభాస్ చంద్రబోస్ అని గోస్వామి వాదించారు. నేతాజీ అదృశ్యంపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ ముందు కూడా గోస్వామి హాజరయ్యారు. కరపత్రంలోని ఫొటోను చూపిస్తూ ఆయన బతికే ఉన్నారని వాదించారు. కానీ బీజింగ్ లో ఇండియన్ ఎంబసీ అధికారులు ఆ ఫొటోలో ఉన్నది బోస్ కాదని నిర్ధారించారు. కాగా బోస్ కు సంబంధించిన మరిన్ని ఫైళ్లను జనవరి తొమ్మిదిన విడుదల చేస్తామని ఈ వెబ్ సైట్ లో పేర్కొన్నారు. అవి కీలక ఆధారాలంటున్నారు కాబట్టి 9వ తేదీన బోస్ మృతిపై చిక్కుముడి వీడబోతుందా అన్నది చూడాలి.