Begin typing your search above and press return to search.

బొకే చేతిలో పెట్టి ‘ప్రధాని’ని ఎత్తి కుదేసిన ఎంపీ

By:  Tupaki Desk   |   12 Dec 2015 6:35 AM GMT
బొకే చేతిలో పెట్టి ‘ప్రధాని’ని ఎత్తి కుదేసిన ఎంపీ
X
రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు సహజం. అయితే.. తన వాదనకు భిన్నమైన నిర్ణయం తీసుకుంటున్నారన్న అక్కసుతో ఉక్రెయిన్ ఎంపీ ఒకరు చేసిన పని సంచలనంగా మారింది. అధికారపక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం.. పార్లమెంటులో ఆందోళన.. నిరసనలు చేపట్టటం.. స్పీకర్ పోడియం చుట్టుముట్టటం.. మరికాస్త ముందుకెళ్లి మైకులు విరిచేయటం.. సభ్యులపై దాడి చేయట లాంటివి మామూలే. కానీ.. అందుకు భిన్నమైన సీన్ ఒకటి ఉక్రెయిన్ పార్లమెంటులో చోటు చేసుకుంది.

యూరప్ కూటమికి అనుకూలంగా ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లును ఉక్రెయిన్ పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. దీన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లును అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. శుక్రవారం పార్లమెంటులో ప్రధాని ఈ అంశంపై ప్రసంగించాల్సి ఉంది. పార్లమెంటులో ప్రధానిని అభినందించే నెపంతో పూల బొకేతో సభకు వచ్చిన సభ్యుడు ఒలేహ్ బర్నా ప్రధాని యాత్సెమ్యాక్ ను అభినందించినట్లుగా బొకేను చేతికిచ్చారు. ఆయన దాన్ని తీసుకున్నంతలో రెప్పపాటులో ప్రధానిని ఎత్తి కుదేశారు.

ఊహించని విధంగా చోటు చేసుకున్న ఈ ఘటనతో ప్రధానితో పాటు.. అధికారపక్ష సభ్యులంతా షాక్ తిన్నారు. వెంటనే తేరుకున్న వారు ఒక్కసారి అగ్రహంతో చెలరేగిపోయి.. సదరు సభ్యుడిపై దాడి చేశారు. వెంటనే.. సదరు ఎంపీని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. సాక్ష్యాత్తు ప్రధాని విషయంలో ఈ తరహా ఘటన చోటు చేసుకోవటం అందరిని నివ్వెరపర్చింది.