Begin typing your search above and press return to search.

నేను, నా కుటుంబమే వాళ్ల టార్గెట్.. అధ్యక్షుడు ఉద్వేగం

By:  Tupaki Desk   |   27 Feb 2022 4:52 AM GMT
నేను, నా కుటుంబమే వాళ్ల టార్గెట్.. అధ్యక్షుడు ఉద్వేగం
X
హాస్య నటుడిగా ఉక్రెయిన్ ప్రజలను కడుపుబ్బా నవ్వించిన... ఆయన ఇప్పుడు భీకర యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు. హాస్యంతో అందరినీ ఖుష్ చేసిన ఆయన.. ఇప్పుడు ఓ సీరియస్ పాత్ర పోషిస్తున్నారు. ఆయన ఎవరో కాదు ఉక్రెయిన్ ఆరో అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్ స్కీ. ఉక్రెయిన్ దేశానికి అధ్యక్షుడు కాకముందు ఆయనో కమెడియన్.

అయితే హాస్య నటుడి స్థాయి నుంచి.. దేశ అధ్యక్షుడి స్థాయి వరకు ఎదగడానికి ఆయన కృషి ఎనలేనిది. ఎన్నో సవాళ్లు.. మరెన్నో ఆటుపోట్ల అనంతరం ఆయనకు ఈ సక్సెస్ దక్కింది. ఈ సంక్షోభం వేళ జెలెన్ స్కీ ఓ ఉద్వేగభరితమైన వీడియోను విడుదల చేశారు. ఆయన మాటలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.

రష్యాతో పోరాడలేక... ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దేశం విడిచి పారిపోయాడనే పుకార్లు గుప్పుమన్నాయి. కాగా దీనిపై ఆయన స్పందించారు. ఓ ఉద్వేగభరితమైన వీడియోను విడుదల చేశారు. తాను ఎక్కడికి వెళ్లలేదని... తన ప్రజల కోసం చివరి నిమిషం వరకు పోరాటం చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

అంతేకాకుండా రష్యాకు టార్గెట్ తానేనని... తన తర్వాత తన అందమైన కుటుంబం అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన దేశానికి అధ్యక్షుడిగానే కాకుండా తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం పడే ఆవేదన ఇలా కన్నీటి రూపంలో బయటకు వచ్చిందని వీడియో సందేశాన్ని చూసిన వారు అనుకుంటున్నారు. అయితే జెలెన్ స్కీ ఫ్యామిలీ గురించి కొన్ని తెలియని విషయాలు మీకోసం...

హాస్య నటుడైన జెలెన్ స్కీ... తన చిన్ననాటి స్నేహితురాలిని 2003లో వివాహమాడారు. క్లాస్ మేట్ ఒలినాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె ఓ సివిల్ ఇంజనీర్. వృత్తి రీత్యా ఓ ఆర్కిటెక్ట్. అంతేకాకుండా స్క్రీన్ రైటర్ లో ప్రతిభ కలవాడు. అంతే కాకుండా సామాజిక కార్యక్రమాల్లోనూ ఆమె చురుగ్గా ఉంటారు. కరోనా వేళ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు.

2019 లో అత్యంత ప్రభావవంతులైన వంద మందిలో ఈమెకు 30స్థానం లభించింది. ఫోకస్ మ్యాగజైన్ జాబితాలో ఈమెది 30 వ స్థానం. కాగా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే జెలెన్ స్కీ దంపతులు... ఫ్యామిలీ కోసం కూడా ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకునేవారు.

జెలెన్ స్కీ-ఒలీనా దంపతులకు ఇద్దరు సంతానం. వీరికి అందమైన కూతురు, ముద్దులొలికే కుమారుడు ఉన్నారు. కూతురు అలెగ్జాండ్రియా, కుమారుడు కిరిల్లో. ఈ ఇద్దరు పిల్లలతో వారి కుటుంబం ఎంతో సంతోషంగా గడుపుతారు. చిన్న వెకేషన్ దొరికినా ఫ్యామిలీ టైమ్ ను చాలా అందంగా ప్లాన్ చేసుకునేవారు జెలెన్ స్కీ. అంతేకాకుండా ఆయన సామాజిక మాధ్యమాల్లో ఫ్యామిలీ ఫొటో లను షేర్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ సంక్షోభ సమయంలోనూ ఆయన చురుగ్గా ఉన్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు.

యుద్ధం సమయంలో తనతోపాటు తన ఫ్యామిలీకి ఏం అవుతుందోనని జెలెన్ స్కీ కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కలచి వేస్తోంది. కుటుంబం గురించి ఇలా ఆలోచిస్తూనే... తన దేశాన్ని కాపాడుకోవాలనే తాపత్రయం ఆయనలో కనిపిస్తుంది. ఈ మేరకు దేశ ప్రజలను క్షమాపణ కోరుతూ వీడియోను విడుదల చేశారు.