Begin typing your search above and press return to search.

అది పేలితే.. ఐరోపా అంతం.. జెలెన్ స్కీ ఆందోళ‌న‌

By:  Tupaki Desk   |   4 March 2022 4:30 PM GMT
అది పేలితే.. ఐరోపా అంతం.. జెలెన్ స్కీ ఆందోళ‌న‌
X
ర‌ష్యా దూకుడుతో ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. వ‌రుస‌గా 9వ రోజు కూడా ర‌ష్యా యుద్ధం ఎక్క‌డా ఆప‌లేదు. పైగా దూకుడు మ‌రింత పెంచుతామ‌ని పేర్కొంది. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం ఉద‌యం.. ఉక్రెయిన్‌లోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రాన్ని ల‌క్ష్యంగా చేసుకుని ర‌ష్యా ద‌ళాలు దాడులు చేశాయి. దీంతో ఆ క‌ర్మాగారం.. మంట‌ల్లో చిక్కుకుంది.

అయితే.. ఇదే క‌నుక పేలితే.. ఐరోపా దేశాలు పూర్తిగా తుడిచి పెట్టుకుపోవ‌డం ఖాయ‌మ‌ని.. ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ హెచ్చ‌రించారు. ర‌ష్యా దూకుడును క‌ట్ట‌డి చేయాల‌ని ఆయ‌న యూర‌ప్ దేశాల‌కు పిలుపునిచ్చారు. ఈ మేర‌కు ఆయ‌న  ఒక వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఆ వీడియోలో జెలెన్‌ స్కీ... ``చెర్నోబిల్‌ అనే పదం తెలిసిన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి. ప్ర‌స్తుతం  జపోరిజ్జియా గనుక పేలితే ఐరోపా అంతం అవుతుంది. ఇది చెర్నోబిల్ క‌న్నా ప‌ది రెట్లు ఎక్కువ సామ‌ర్థ్యంతో ఉంది`` అని చెప్పారు. అంతేకాదు ఆ అణు కర్మాగారాన్ని తాము ఇంత వరకు సురక్షితంగా ఉంచామ‌ని, తాము ఈ యుద్ధంలో ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడలేదని తెలిపారు.

ఈ దాడి కారణంగా అది ఎప్పుడూ పేలుతుందో కూడా కచ్చితంగా చెప్పలేమ‌న్నారు. అయినా రష్యన్ ట్యాంకులు థర్మల్ ఇమేజర్‌లతో అమర్చబడి ఉన్నాయన్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన దాడి మాత్రం కాదని, ఈ దాడిని అణు టెర్రర్‌గా అభివర్ణించారు. కానీ త‌మ‌కు దేనిపై కాల్పులు జరుపుతున్నాం అనే విషయం పై స్పష్టమైన అవగాహన ఉందన్నారు.

గ‌తంలో జ‌రిగిన చర్నోబిల్ కేంద్రంపై దాడిని  ప్రస్తావిస్తూ..ఆ ప్రపంచ విపత్తు పర్యవసానాన్ని వందల వేలమంది ప్రజలు ఎదుర్కొన్నారని తెలిపారు. పదివేల మంది ఆ ప్రదేశం నుంచి ఖాళీ చేయవలసి వచ్చిందని, రష్యా దీన్ని పునరావృతం చేయాలనే దురాలోచనతో ఉంద‌ని విరుచుకుప‌డ్డారు.

``యూరోపియన దేశాల నాయకులారా మేల్కొండి. జపోరిజ్జియా 15 బ్లాక్‌లు కలిగిన అతి పెద్ద ప్లాంట్‌. ఒక వేళ పేలుడు సంభవించినట్లయితే ఇది ఐరోపా వాసులందరకీ ముగింపే అనే విషయాన్ని గుర్తించండి`` అని విన్న‌వించారు.

"రష్యా తప్ప ఏ ఇతర దేశం అణు విద్యుత్ కేంద్రాలపై దాడి జరపలేదు. ఇది మానవ చరిత్రలోనే మొదటిసారి. ఉగ్రవాద ధోరణి అనుసరిస్తోన్న ఆ దేశం.. ఇప్పుడు అణు బీభత్సానికీ ఒడిగట్టింది. చెర్నోబిల్‌ అణువిపత్తును పునరావృతం చేసేందుకు మాస్కో ప్రయత్నిస్తోంది.`` అని జెలెన్ స్కీ నిప్పులు చెరిగారు.

మరోపక్క పుతిన్ మాత్రం దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. తాము ప్రారంభించిన ప్రత్యేక సైనిక చర్యను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నామని ఇదివరకే వ్యాఖ్యలు చేశారు. కాగా, ఉక్రెయిన్‌ను లొంగదీసుకునే క్రమంలో రష్యా అణు పదార్థాలతో చెలగాటం ఆడటాన్ని ప్రపంచదేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి.