Begin typing your search above and press return to search.

యుద్దానికి మూల్యం చెల్లిస్తున్న రష్యా.. పుతిన్ కు వరుస షాకులు

By:  Tupaki Desk   |   16 Jun 2022 2:30 AM GMT
యుద్దానికి మూల్యం చెల్లిస్తున్న రష్యా.. పుతిన్ కు వరుస షాకులు
X
యుద్ధం అందరూ అనుకునేంత ఫ్యాన్సీగా ఉండదు. అది చేసే విధ్వంసం అంతా ఇంతా కాదు. కొద్ది మంది కొన్ని సందర్భాల్లో యుద్దం చేసేయాలి.. అవతలవారి లెక్క తేల్చేయాలంటూ తీవ్రమైన భావోద్వేగాన్ని ప్రదర్శిస్తుంటారు. కానీ.. యుద్ధం విలువైన ప్రాణాల్ని తీయటమే కాదు.. రక్తంతో తడిచే నేల.. దాని తాలుకూ గురుతుల్ని ఏళ్లకు ఏళ్లుకొనసాగేలా చేస్తుంది. అందుకే తెలివైనోడు పాలకుడిగా ఉంటే యుద్ధం దరికి తన దేశం వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రపంచానికి పెద్దన్న అమెరికా మాత్రం మరింత తెలివిగా ప్రపంచంలోని పలు దేశాలు యుద్ధంలో మునిగి తేలేలా చేస్తూనే.. దాని ప్రభావం తన వరకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. అయితే.. అన్ని సందర్భాల్లో అలాంటి ఎత్తుగడ పారదన్న విషయం లాడెన్ విషయంలో అమెరికాకు బాగానే అర్థమైన సంగతి తెలిసిందే.

అదిలించి.. బెదిరించి తాను అనుకున్నది పూర్తి చేయాల్సిన రష్యా.. ఉక్రెయిన్ ఎపిసోడ్ లో తన సామర్థ్యం మీద తనకున్న అతివిశ్వాసంతో తప్పటడుగు వేయటం తెలిసిందే. వారం.. పది రోజుల వ్యవధిలో ఉక్రెయిన్ ను దారికి తెచ్చుకోవచ్చన్న తప్పుడు లెక్కలతో మొదలైన యుద్ధం రష్యాకు షాకుల మీద షాకులు ఇస్తోంది. ఇప్పటికే సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధాన్ని ఎలా ముగించాలో సతమతమవుతున్న రష్యాకు.. తాజాగా కొత్త సమస్యలు తెర మీదకు వస్తున్నయి.

ఉక్రెయిన్ తో సాగుతున్న యుద్దంతో రష్యాలోనూ ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రాశ్చాత్య దేశాలకు సంబంధించిన వస్తు సేవలు.. బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవటం.. దీంతో రష్యన్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వైనం తెలిసిందే. మొదట్లో సర్దుకున్న పలు వర్గాల వారు ఇప్పుడు దేశాన్ని విడిచి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు రష్యాలోని సంపన్నులు ఇప్పటికే పెద్ద ఎత్తున దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంపన్నులు.. తమ డిమాండ్లకు పుతిన్ మాట వినకపోవటంతో ఎవరికి వారు.. రష్యాను విడిచిపెట్టి వేరే దేశాలకు వెళ్లిపోతున్నారు.

తాజాగా అందుతున్న లెక్కల ప్రకారం చూస్తే.. ఈ ఏడాది చివరి నాటికి రష్యాను విడిచిపెట్టి విదేశాలకు వెళ్లిపోయే సంపన్నుల సంఖ్య ఏకంగా 15వేల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2019తో పోలిస్తే ఈ సంఖ్య మూడింతలు ఉన్నట్లుగా చెబుతున్నారు. పుతిన్ పాలనలో రష్యాలోని సంపన్నులు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. నియంతకు నిలువెత్తు రూపంగా.. తనను వ్యతిరేకించే వారి విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఆయన వైఖరిపై సంపన్నులు గుర్రుగా ఉన్నారు.

రష్యాను విడిచిపెట్టి వెళ్లిపోతున్న సంపన్నుల్లో అత్యధికులు యూఏఈకి వెళ్లిపోతున్నట్లుగా చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వలసల్ని విపరీతంగా ఆకర్షిస్తున్న దేశంగా యూఏఈ నిలుస్తోంది. మిలియనీర్లకు యూఏఈ స్వర్గధామంగా మారిందంటున్నారు. ఏడాదికి దాదాపు వెయ్యి మంది సంపన్నులు యూఏఈకి వెళ్లి స్థిరపడుతున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. 2019లో ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 1300 మంది సంపన్నులు యూఏఈకి వెళ్లి స్థిరపడగా.. 2022లో ఇది కాస్తా నాలుగు వేల మంది వరకు ఉండొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

సంపన్నులు రష్యాను విడిచి విదేశాలకు వెళ్లిపోవటం ద్వారా దేశం పతనం షురూ అవుతుందన్న ఆందోళనలు ఎక్కువ అవుతున్నాయి. ఇదంతా చూస్తే.. ఉక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించిన పుతిన్ కు ఎదురుదెబ్బలు తప్పించి.. మరింకేమీ మిగల్లేదని చెప్పక తప్పదు. రష్యా కారణంగా ఎదురైన యుద్ధంతో ఉక్రెయిన్ ఎంతటి ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్లిందన్నది నిజమే. ఆ దేశానికి చెందిన సంపన్నులు కూడా భారీ ఎత్తున విదేశాలకు వలస వెళ్లిపోయారు. అయితే.. ఈ వలస తాత్కాలికమా? శాశ్వితమా? అన్నది తేలాల్సి ఉంది.ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 50 వేల మంది సంపన్నులు ఉక్రెయిన్ ను విడిచిపెట్టి వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు.