Begin typing your search above and press return to search.

బందీలుగా భార‌త విద్యార్థులు!

By:  Tupaki Desk   |   4 March 2022 6:36 AM GMT
బందీలుగా భార‌త విద్యార్థులు!
X
ఉక్రెయిన్‌పై యుద్ధం ప్ర‌క‌టించిన ర‌ష్యా.. ఆ దేశ రాజ‌ధానిని ఆధీనంలోకి తీసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. మ‌రోవైపు ఉక్రెయిన్ సేన‌లు కూడా ర‌ష్యా ద‌ళాల‌కు ఎదురొడ్డి పోరాడుతున్నాయి. క్ర‌మంగా తీవ్ర రూపం దాల్చిన ఈ ర‌ణం ఎంతోమంది ప్రాణాల‌ను పొట్ట‌న పెట్టుకుంటోంది. ఈ నేప‌థ్యంలో ఉక్రెయిన్ నుంచి ల‌క్ష‌లాది ప్ర‌జ‌ల వ‌ల‌స వెళ్లిపోతున్నారు. మ‌రోవైపు అక్క‌డ చిక్కుకున్న భార‌త విద్యార్థుల‌ను స్వ‌దేశం ర‌ప్పించేందుకు మోడీ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇప్ప‌టికే దాదాపు 18 నుంచి 20 వేల మంది విద్యార్థుల‌ను భార‌త్‌కు తీసుకు వ‌చ్చామ‌ని విదేశాంగ శాఖ చెబుతోంది.

ఈ నేప‌థ్యంలో ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. ఉక్రెయిన్‌లో భార‌త విద్యార్థులు బందీలుగా ఉన్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. దాదాపు 3 వేల మంది విద్యార్థులు బందీలుగా ఉన్నార‌ని ఆయ‌న వెల్ల‌డించారు. అందులో భార‌త్‌తో పాటు చైనా విద్యార్థులు కుడా ఉన్నార‌ని తెలిపారు. విదేశీయుల‌ను బందీలుగా ఉంచ‌డానికి ఉక్రెయిన్ ప్ర‌య‌త్నిస్తోంద‌ని పుతిన్ ఆరోపించారు. అలా బందీలుగా ఉంచి ఆయా దేశాల‌ను బెదిరించాల‌ని చూస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. ఆయ‌న వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఇక్క‌డి త‌ల్లిదండ్రుల్లో క‌ల‌వ‌ర‌పాటు మొద‌లైంది. అయితే ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల్లో నిజానిజాలెంత వ‌ర‌కూ ఉన్నాయో తెలియాల్సి ఉంది.

మ‌రోవైపు ఆప‌రేష‌న్ గంగా పేరుతో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భార‌త విద్యార్థుల‌ను స్వ‌దేశం తీసుకు వ‌చ్చేందుకు దేశ ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌నే వేగ‌వంతం చేసింది. పౌర విమాన‌యాన మంత్రి జ్యోతిరాదిత్య సిందియా కూడా రంగంలోకి దిగారు. ప్ర‌ధాని మోడీ ఆదేశాల‌తో ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ కూడా విద్యార్థుల‌ను తీసుకువ‌చ్చే చ‌ర్య‌ల్లో మునిగిపోయింది. విదేశాంగ శాఖ‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ఉక్రెయిన్‌లోని భార‌తీయుల‌ను స్వ‌దేశానికి త‌ర‌లించేందుకు సీ-17 విమానాల‌ను పంపేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్ప‌టికే ఉక్రెయిన్‌, ర‌ష్యా దేశాల‌తో విదేశాంగ శాఖ చ‌ర్చ‌లు ప్రారంభించింది. ఈ నేప‌థ్యంలో భార‌త విద్యార్థులు ఉక్రెయిన్‌లో బందీలుగా ఉన్నార‌ని పుతిన్ చెప్ప‌డం సంచ‌ల‌నంగా మారింది.