Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ యుద్ధ వ్యూహ‌క‌ర్తే ల‌క్ష్యంగా బాంబుదాడి!

By:  Tupaki Desk   |   21 Aug 2022 11:30 PM GMT
ఉక్రెయిన్ యుద్ధ వ్యూహ‌క‌ర్తే ల‌క్ష్యంగా బాంబుదాడి!
X
ర‌ష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌కు షాక్ త‌గ‌లింది. ఆయ‌నకు అత్యంత స‌న్నిహితుడు, ఉక్రెయిన్ యుద్ధం వ్యూహక‌ర్త‌గా పేరొందిన‌ అలెగ్జాండ‌ర్ డుగిన్ కుమార్తె డార్యా డుగిన్ కారు బాంబు దాడిలో మృత్యువాత ప‌డ్డారు. అలెగ్జాండ‌ర్ డుగిన్ ప్ర‌భావానికి లోన‌య్యే పుతిన్ ఉక్రెయిన్ యుద్ధానికి దిగ‌డానికి గ‌తంలోనే వార్త‌లు వ‌చ్చాయి.

ఆగ‌స్టు 20 శనివారం రాత్రి ర‌ష్యా రాజ‌ధాని మాస్కో శివారు ప్రాంతంలో ఈ కారు బాంబు దాడి జరిగిన‌ట్టు తెలుస్తోంది. ఈ దాడి అలెగ్జాండర్‌ను లక్ష్యంగా చేసుకొని చేసింద‌నేన‌ని స‌మాచారం. అయితే కారుపై బాంబు దాడి జ‌రిగిన‌ప్పుడు కారులో అలెగ్జాండ‌ర్ లేరు. ఆయ‌న కుమార్తె డార్యా డుగిన్ కారులో ప్ర‌యాణిస్తున్న‌ట్టు తెలిసింది. దీంతో బాంబు దాడిలో ఆమె అక్క‌డిక‌క్క‌డే మరణించినట్లు రష్యా మీడియా వెల్లడించింది. అయితే, అలెగ్జాండర్ వేరే కారులో వెళ్లడంతో ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

డార్యా తన కారులో ఇంటికి బయల‍్దేరగా.. మొజస్కౌయి హైవేపై బోల్షియా అనే గ్రామం వద్దకు రాగానే కారులో భారీ పేలుడు సంభవించింద‌ని ర‌ష్య‌న్ మీడియా తెలిపింది. దాడిలో ధ్వంసమైన కారు వాస్తవానికి అలెగ్జాండర్‌ది అని ఆయనే ఉక్రెయిన్ ఉగ్ర‌వాదుల‌ అసలైన లక్ష్యమని రష్యా అధికారులు అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం విషయంలో పుతిన్‌ను అలెగ్జాండర్‌ బాగా ప్రభావితం చేశార‌ని.. అందుకే ఆయ‌న‌పై హ‌త్యాయ‌త్నానికి ఉక్రెయిన్ ప్ర‌భుత్వ ఉగ్ర‌వాదుల ప్ర‌ణాళిక ర‌చించార‌ని చెబుతున్నారు. కాగా అలెగ్జాండ‌ర్ కుమార్తె డార్యా డుగిన్ రచయిత. ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం సంద‌ర్బంగా అమెరికా నిషేధం విధించిన ర‌ష్య‌న్ల జాబితాలో డార్యా కూడా ఉన్నారు. ఆమె ఉక్రెయిన్ పై రాసిన వ్యాసం కారణంగానే ఈ జాబితాలో చేర్చింది. కాగా, డార్యా డుగిన్ 1992లో జన్మించింది. మాస్కో స్టేట్ యూనివర్శిటీలో ఫిలాసఫీ చ‌దివారు.

సీసీటీవీ కెమెరాల్లో అలెగ్జాండ‌ర్ కుమార్తె డార్యా డుగిన్‌ కారు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు క‌నిపించాయి. రహదారి పక్కన వాహనం మంటల్లో ఉన్నట్లు, చుట్టుపక్కల ప్రాంతాలలో ధ్వంసమైన కారు భాగాలు కనిపిస్తున్నాయి. ఇవి ర‌ష్య‌న్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. కాగా ఉక్రెయిన్ ప్ర‌భుత్వ‌ ఉగ్ర‌వాదులే అలెగ్జాండర్‌ కుమార్తె డార్యా డుగిన్‌ను హత్య చేశారని డొనెట్స్క్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ అధినేత డెనిస్‌ పుషిలిన్ ఆరోపించారు. అలెగ్జాండర్‌ డుగిన్‌ను చంపడానికి ప్ర‌య‌త్నించి.. ఆయన కూతురిని హత్య చేశార‌ని తెలిపారు.