Begin typing your search above and press return to search.

ఇద్దరు చంద్రుళ్లను ఆమె కలిసి రమ్మంది

By:  Tupaki Desk   |   5 Sep 2016 5:42 AM GMT
ఇద్దరు చంద్రుళ్లను ఆమె కలిసి రమ్మంది
X
విభజన జరిగిన నాటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బోలెడన్ని పంచాయితీలు. వీటి పుణ్యమా అని పలు సందర్భాల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికారులు తలలు పట్టుకునే పరిస్థితి. అధికారులు మాత్రమే కాదు.. ఇద్దరు చంద్రుళ్ల మధ్యనున్న రాజకీయ వైరం పుణ్యమా అని ప్రజలు సైతం ప్రభావితమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు చంద్రుళ్లు ఒక్కచోట కూర్చొని సమస్యలపై మనసు విప్పి మాట్లాడుకోవాలని.. పంచాయితీల్ని క్లోజ్ చేసుకోవాలన్న వినతులు పలువురు చేశారు. అయినప్పటికీ అదేమీ వర్క్ వుట్ కాలేదు. రెండు రాష్ట్రాల మధ్య ఎన్ని వివాదాలు ఉన్నా.. వాటిని పరిష్కరించే దిశగా ఇద్దరు చంద్రుళ్లు ఒక్కచోట కూర్చొని చర్చించుకోవటం కనిపించదు.

ఆ మధ్యన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర రెండురాష్ట్రాల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకోవటం.. రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య తోపులాట వరకూ వెళ్లిన నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రులు హుటాహుటిగా సమావేశమై.. అప్పటి ఉద్రికత్తల్ని సద్దుమణిగేలా చేశారు. ఇది తప్పించి తర్వాత ఎప్పుడూ.. ఏ వివిదం మీదన ఒక వేదిక మీద కూర్చొని మాట్లాడుకున్నది లేదని చెప్పాలి. విభజన జరిగిన తొలినాళ్లలో గవర్నర్ దగ్గర ఇద్దరుసీఎంలు భేటీ అయినా అదేమీ ప్రయోజనం చేకూరలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు.

ఇదిలా ఉండగా.. తాజాగా రెండు రాష్ట్రాల మధ్యనున్న జలవివాదాల్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు కేంద్రమంత్రి ఉమాభారతి స్వయంగా రంగంలోకి దిగటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా ఉన్న పాలమూరు – రంగారెడ్డి.. దిండి ఎత్తిపోతల పథకం మీద చర్చలు జరిపేందుకు ఇద్దరు చంద్రుళ్లను ఆమె సమావేశానికి పిలుస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 11.. 18..19 తేదీల్లో ఇరువురు సీఎంలకు ఆమోదయోగ్యమైన తేదీల్ని తెలపాలంటూ తాజాగా ఉమాభారతి లేఖలు రాయటం ఆసక్తికరంగా మారింది.

తెలుగు రాష్ట్రాల మద్యనున్న వివాదాల్ని పరిష్కరించేందుకు ఇద్దరు చంద్రుళ్ల మధ్య సరైన భేటీ ఏదీ జరగలేదన్న మాట వినిపిస్తున్న వేళ.. కేంద్రమంత్రి ఉమాభారతి రెండు రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రుల్ని ఒకేచోటకు తీసుకొచ్చేందుకు చేస్తున్నప్రయత్నం రాజకీయ వర్గాల్ని ఆకర్షిస్తోంది. మరి.. ఉమాభారతి మాటకు ఇద్దరు చంద్రుళ్లు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఉమాభారతి పుణ్యమా అని ఇద్దరు చంద్రుళ్లు వివాదాల్ని పరిష్కరించుకునే దిశగా చర్చలు జరిపితే తెలుగు ప్రజలకు అంతకుమించి కావాల్సింది ఏముంటుంది..?