Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ను క‌లిసిన ఉమామాధవరెడ్డి..రాజ్య‌స‌భ హామీ?!

By:  Tupaki Desk   |   12 Dec 2017 12:55 PM GMT
కేసీఆర్‌ను క‌లిసిన ఉమామాధవరెడ్డి..రాజ్య‌స‌భ హామీ?!
X
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మ‌రో షాక్‌. తెలంగాణ టీడీపీకి రేవంత్ రెడ్డి గుడ్ బై చెప్పిన అనంత‌రం కొన‌సాగుతున్న వ‌ల‌స‌ల ప‌ర్వంలో మ‌రో ఎపిసోడ్ ఇవాళ చోటుచేసుకుంది. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి, ఆమె కుమారుడు, భువనగిరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సందీప్‌రెడ్డి కలిశారు. రాష్ర్టాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేయాలని తన మనోగతాన్ని సందీప్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెల 14న మధ్యాహ్నం 12 గంటలకు తన అనుచరులతో కలిసి ఉమా మాధవరెడ్డి, సందీప్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

అయితే గ‌త కొద్దికాలంగా తెలంగాణ టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి పార్టీ మార‌నున్నార‌నే వార్త‌లు షికార్లు చేస్తున్నాయి. గ‌త నెల‌ శాసనసభకు వచ్చిన ఉమా మాధ‌వ‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను క‌లిశారు. సీఎం కేసీఆర్ నేరుగా ఆమెతో మాట్లాడి రాజకీయ భవిష్యత్ కు హామీనిచ్చినట్లు తెలిసింది. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ పార్టీ మార్పున‌కు సంకేతాలిచ్చారు. ఇప్ప‌టికే తన అనుచరులతో ఇప్పటికే పలుమార్లు చర్చలు జరపగా, ఎక్కువమంది టీఆర్ఎస్‌లోకి వెళ్ళేందుకు మొగ్గుచూపినట్లు సమాచారం. వ‌చ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల్లో ఒకటి ఇస్తామని హామీ ఇచ్చినట్లు ఉమామాధ‌వ‌రెడ్డి స‌న్నిహితవర్గాలు చెబుతున్నాయి. న‌ల్ల‌గొండ‌లో బ‌లోపేతం అయ్యేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్న సీఎం కేసీఆర్ ఈ హామీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. దీంతో ఉమా మాధ‌వ‌రెడ్డి తెలంగాణ రాష్ట సమితిలో చేరడం దాదాపు ఖాయమైందని వార్త‌లు వ‌చ్చాయి. ఆ వార్త అధికారికంగా నిరూపితం అయింది.

రాష్ట్ర రాజకీయాల్లో నల్లగొండ జిల్లా భువనగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మాధవరెడ్డి ప్రత్యేకముద్ర వేయగా, ఆయన తదనంతరం ఉమా మాధవరెడ్డి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించి, నల్లగొండ జిల్లాపై పట్టు కొనసాగించారు. అయితే రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలుగుదేశం పార్టీ కుదేల‌యిపోవ‌డం...మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తన కుమారుని రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారక తప్పదని గ్రహించిన ఆమె సీఎం కేసీఆర్‌ను క‌లిసిన‌ట్లు స‌మ‌మాచారం. తనకుమారుని భవిష్యత్‌పై కూడా ఆమె హామీ కోరగా, అది తనకు వదిలేయమని సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చజరుగుతోంది.