Begin typing your search above and press return to search.

‘ఉమేశ్​ చంద్ర’ అంటే ల్యాండ్​ మార్క్​ కాదు.. అసాంఘిక శక్తుల గుండెల్లో ల్యాండ్​మైన్​

By:  Tupaki Desk   |   21 Oct 2020 11:22 AM GMT
‘ఉమేశ్​ చంద్ర’ అంటే ల్యాండ్​ మార్క్​ కాదు..  అసాంఘిక శక్తుల గుండెల్లో ల్యాండ్​మైన్​
X
ఉమేశ్​ చంద్ర ఐపీఎస్​.. ఆయన పేరు తెలియని తెలుగువారుండరంటే అతీశయోక్తి కాదేమో. వరంగల్, కడప, కరీంనగర్​ జిల్లాల్లో నక్సలిజం, ఫ్యాక్షనిజం, రౌడీయిజాన్ని ఆయన అణచివేశారు.ప్రజల దృష్టిలో హీరోగా ఖ్యాతిని సంపాదించుకున్నారు. పోలీసులను ప్రజలకు స్నేహితులుగా మార్చారు. ప్రజల ఇళ్లలో పోలీస్​ ఫొటో పెట్టుకొనే స్థాయికి ఎదిగారు. చివరకు 1999లో హైదరాబాద్​ నడిరోడ్డులో నక్సలైట్లతో చేతిలో అమరుడయ్యారు. అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్ మధ్య సర్కిల్ లో ఉమేశ్ చంద్ర విగ్రహం ఉంది. నేటి యువతరానికి ఈ స్టాచ్యూ ఓ ల్యాండ్​ మార్క్​ మాత్రమే.. కానీ ఆ పవర్​ ఫుల్​ పోలీస్​ ఆఫీసర్​ చరిత్ర ఎంతమందికి తెలుసు.. రియల్​ హీరోగా ప్రజల మన్ననలు అందుకొని.. రౌడీలు, ఫాక్ష్యనిస్టులు, గూండాల వెన్నులో ఆయన వణుకు పుట్టించారు. అసాంఘిక శక్తుల గుండెల్లో ల్యాండ్‌మైన్‌ ఈ ఐపీఎస్​. ఉమేశ్ చంద్ర జీవితం పోలీసులకు ఓ పాఠ్యాంశం.

గుంటూరు జిల్లాలో జననం

1966 మార్చి 19న ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఉమేశ్ చంద్ర జన్మించారు. ఆయన చదువంతా హైదరాబాద్​లోనే సాగింది. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్య, నిజాం కాలేజీలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చదివారు. మ్యాథ్స్, ఎకనామిక్స్‌లో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. సివిల్స్ రాసి ఐపీఎస్‌గా ఎంపికయ్యారు.

వరంగల్‌ రూరల్ ఏఎస్పీగా తొలి పోస్టింగ్ వచ్చింది. అక్కడ నక్సలిజాన్ని అంతం చేసేందుకు 'జన జాగృతి' అనే సంస్థను ప్రారంభించారు. అప్పటినుంచే ఆయన నక్సలైట్లకు శత్రువయ్యారు. తర్వాత 1992 అక్టోబర్‌లో పులివెందుల ఏఎస్పీగా బదిలీ అయ్యారు. అక్కడి ఫ్యాక్షనిస్టులకు చుక్కలు చూపించారు. పవర్​ఫుల్​ లీడర్​ రాజశేఖర్​రెడ్డి తండ్రి రాజారెడ్డినే అయన అరెస్ట్​ చేశారంటే ఎంతటి తెగువ చూపారో అర్థం చేసుకోవచ్చు.


వరంగల్​లోనూ విరుచుకుపడ్డారు..

ఆ తర్వాత మళ్లీ వరంగల్‌ ఓఎస్డీగా ఉమేశ్​ బదిలీ అయ్యారు. ఈసారి దూకుడు పెంచారు. ప్రజలతో పోలీసులకు సంబంధాలు మెరుగుపరిచారు. దీంతో ఏ సమస్య వచ్చినా నక్సలైట్లను ఆశ్రయించే జనం చిన్నగా పోలీసుల వద్దకు రావడం మొదలుపెట్టారు. నక్సలైట్లకు ఉచ్చు బిగిసింది. చాలామంది నక్సలైట్లు జైలుపాలయ్యారు. వరంగల్ ఓఎస్డీ తర్వాత తర్వాత ఉమేశ్ చంద్ర మరోసారి కడపకు బదిలీ అయ్యారు. ఈసారి జిల్లా ఎస్పీ హోదాలో వెళ్లారు. ఏఎస్పీగా ఉన్నప్పుడే ఫ్యాక్షనిస్టులకు నిద్రలేకుండా చేసిన ఉమేశ్ చంద్ర... ఎస్పీగా వెళ్లి అంతే కఠినంగా ఉన్నారు. రెండేళ్లు కడపలో ఎస్పీగా పనిచేసి 1997లో కరీంనగర్ జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. ఆయన బదిలీ అయిన ప్రతిసారి ప్రజలు ఆందోళనలు చేసేవారంటే .. ఆయనకు ప్రజల్లో ఎంతటి హీరో వర్షిప్​ ఉందో అర్థం చేసుకోవచ్చు.

4 సెప్టెంబర్, 1999 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చీకటి రోజు. హైదరాబాద్ ఎస్సార్‌నగర్ ట్రాఫిక్ సిగ్నల్ ‌దగ్గర ఐపీఎస్ ఉమేశ్ చంద్రను నలుగురు నక్సలైట్లు దారుణంగా కాల్చిచంపారు. గాయాలతోనే కారులోంచి దిగి నక్సలైట్లను తరిమారు. కానీ... ఉమేశ్ చంద్ర చేతిలో గన్ లేకపోవడంతో ఎదురుతిరగలేకపోయారు. నక్సలైట్లు మళ్లీ కాల్పులు జరపడంతో ఉమేశ్ చంద్ర అక్కడే చనిపోయారు. ఉమేశ్ చంద్రతో పాటు ఆయన గన్‌మ్యాన్, డ్రైవర్ కూడా ప్రాణాలొదిలారు. పట్టపగలు... హైదరాబాద్ మహానగరంలో నడిరోడ్డుపై ఓ ఐపీఎస్ ఆఫీసర్‌ని నక్సలైట్లు కాల్చిచంపిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

నాలుగో సింహం

‘కనిపించని నాలుగో సింహమే పోలీస్‌’ అంటూ సినిమాల్లో డైలాగ్​లు వింటుంటాం. అయితే ఆ డైలాగ్​కు నిజజీవితంలో ఉమేశ్​ గౌరవం తీసుకొచ్చారని చెబుతుంటారు పోలీసులు. ఆయన కింద పనిచేసే పోలీసులతో ఉమేశ్​ ఎంతో గౌరవంగా స్నేహంగా ఉండేవారు.